సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించిన బీజేపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకుని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ కూటమిని కొనసాగించే దిశగా బీజేపీ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. ఇప్పటికే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎనిమిది చోట్ల బహిరంగ సభల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆ పార్టీ జాతీయ నాయకులు తమిళనాడులో పర్యటించే పనిలో పడ్డారు. మంగళవారంతో ప్రచారం పరిసమాప్తం అవుతుండడంతో అంతలోపు నేతల పర్యటనను ముగించేందుకు ఏర్పాట్లు చేశారు. అద్వానీ రాక: వేలూరు బీజేపీ అభ్యర్థి ఏసీ షణ్ముగంకు మద్దతుగా ప్రచారానికి అద్వానీ సిద్ధం అయ్యారు. తంజావూరులోని తమ అభ్యర్థి కరుప్పు మురుగానందానికి మద్దతుగా ఓట్ల వేటకు సిద్ధం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం చెన్నైకు వచ్చే అద్వానీ హెలికాప్టర్‌లో వేలూరు వెళ్లనున్నారు. అక్కడి మండి వీధిలో మూడు గంటలకు జరిగే ప్రచార సభలో అద్వానీ ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి సరిగ్గా 4 గంటలకు హెలికాప్టర్‌లో తంజావూరు బయలు దేరనున్నారు. తంజావూరు సర్పోజి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి.
అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా తిలగర్ దిడల్‌కు చేరుకుని ప్రచార సభలో అద్వానీ పాల్గొంటారు. ఆరుగంటలకు రోడ్డు మార్గాన తిరుచ్చి చేరుకునే అద్వానీ, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక, ఆదివారం బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పొల్లాచ్చిలో పర్యటించారు. అక్కడ తమ కూటమి తరపున ఎన్నికల బరిలో ఉన్న కొంగు మక్కల్‌దేశీయ కట్చి నేత ఈశ్వరన్‌కు మద్దతుగా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ కాసేపు రోడ్ షో నిర్వహించారు. అనంతరం అక్కడి ప్రచార సభలో ప్రసంగించారు.రాహుల్: రామనాథపురం బరిలో ఉన్న పార్టీ జాతీయ కార్యదర్శి తిరునావుక్కరసుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి రాహుల్ రానున్నారు. సోమవారం సాయంత్రం రామనాథపురంలో జరిగే ప్రచార సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని రామనాథపురంలో భారీ ఏర్పాట్లు చేశారు. గట్టి భద్రత నడుమ రాహుల్ పర్యటన సాగనున్నది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, రామనాథపురానికి సమీపంలోని ఇతర లోక్‌సభ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులను ఈ సభకు ఆహ్వానించారు.
ప్రచార బాటలో అద్వానీ, రాహుల్
Published Sun, Apr 20 2014 11:50 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement