
అక్కడికెళ్లామంటే ప్రపంచంతో సంబంధాలు కట్ అయినట్లే. అలాంటి ప్లేస్ అది. ఇప్పుడు త్రిష అక్కడే ఉన్నారు. ఆ ప్లేస్ పేరు ‘ఏర్కాడ్’. తమిళనాడులో ఉంది, సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందవు. ఇవాళ చేతిలో సెల్‌ఫోన్ మోగకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా కుడి భుజం లేనట్లుగా కొంతమంది ఫీలవుతారు. కానీ, త్రిష మాత్రం హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే వెళ్లింది షూటింగ్‌కి కదా. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకపోవడంతో హిల్ స్టేషన్‌లో హ్యాపీగా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ‘పరమపదమ్’ అనే సినిమా చిత్రీకరణ ఏర్కాడ్‌లో జరుగుతోంది.
ఇందులో త్రిష డాక్టర్ రోల్ చేస్తున్నారట. తిరుజ్ఞానమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. సమాజానికి సేవ చేయాలనుకునే ఓ డాక్టర్ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది మెయిన్ పాయింట్ అని సమాచారం. మరో మూడు వారాల పాటు ఏర్కాడ్‌లోనే షూటింగ్. సో.. త్రిష దాదాపు ఎవరికీ అందుబాటులో ఉండరన్న మాట. అందుకే మూడు నాలుగు రోజులుగా త్రిష సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేరు. ఈ సినిమాతో కలిపి ఈ బ్యూటీ చేతిలో మరో ఆరేడు చిత్రాలు ఉన్నాయి. వచ్చే ఏడాది వీటిలో మినిమమ్ ఐదు సినిమాలైనా రిలీజవుతాయని ఊహించవచ్చు. ఒకే ఏడాది ఐదు సినిమాలంటే గ్రేట్. మరి.. త్రిషానా! మజాకా! అన్నట్లు ఈ బ్యూటీ త్వరలో ‘హే జుడే’తో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.