జోరందుకున్న నకిలీనోట్ల చలామణి
జోరందుకున్న నకిలీనోట్ల చలామణి
Published Wed, Nov 9 2016 9:48 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
* సేమ్ టు సేమ్‌గా ఉన్న నకిలీనోట్లు
* గుర్తించడంలో అయోమయం
* నష్టపోతున్న వ్యాపారులు
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పెట్రోల్ బంకులు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు తదితరాల్లో 3 రోజుల వరకు రూ.500, రూ.1000 నోట్ల చలామణికి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో సందట్లో సడేమయాలా కొందరు నకిలీ నోట్ల చెలామణికి తెరతీశారు.
నరసరావుపేట టౌన్: నకిలీ నోట్లు హల్‌చల్ చేస్తున్నాయి. మక్కీకి మక్కీగా నోట్ల ముద్రణ ఉండటంతో అసలేదో నకిలీ ఏదో తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రప్రభుత్వం పెద్దనోట్లు రద్దుచేసే క్రమంలో పెట్రోల్ బంక్, హాస్పటల్, ప్రభుత్వ గుర్తింపు కలిగిన అత్యవరస విభాగాలలో మాత్రమే రూ.500, 1000 నోట్లు చెల్లుబాటు అవుతాయిని ప్రకటించింది. దీంతో నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు అక్రమార్కులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం విధించిన రెండురోజుల గడువుల్లో నకిలీనోట్లు చెలామణిచేసి చేతులు దులుపుకొనేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పట్టుబడుతుండగా మరికొందరు యథేచ్ఛగా తమ కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్నారు. బుధవారం నరసరావుపేట పట్టణంలోని ఓ పెట్రోల్‌బంక్‌లో నకిలీ రూ.500 నోటు చెలామణి చే స్తూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. నకిలీదని గుర్తించిన సిబ్బంది అతనిని ప్రశ్నించేలోపే జారుకున్నాడు. అదేవిధంగా మరో సెల్‌షాప్‌లో కస్టమర్ ఇచ్చిన నగదులో రూ.500 నకిలీ నోటును గుర్తించారు. చెలామణికి వస్తున్న నకిలీ నోట్లు వ్యాపారుల్లో అలజడి రేకెత్తిస్తున్నాయి.
నరసరావుపేట కేంద్రంగా చలామణి...
డివిజన్ కేంద్రమైన నరసరావుపేటను కేంద్రంగా చేసుకొని అక్రమార్కులు నకిలీనోట్ల చలామణి చేస్తున్నారు. అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలు పట్టణంలో ఉన్న కారణంగా నిత్యం కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్రమార్కులు నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకొన్నారు. గతంలో పెదకూరపాడుకు చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని ఓ బార్‌అండ్ రెస్టారెంట్‌లో నకిలీ నోట్లు చెలామణి చేస్తూ పట్టుబడ్డ సంఘటనపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. పల్నాడు ప్రాంతంలో నకిలీ నోట్లను ముద్రించి ఏజంట్ల ద్వారా పలు పట్టణాల్లో బదలాయిస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అయితే అక్కడక్కడ నకిలీలు పట్టుబడుతూ ఉన్నప్పటికీ తెరవెనుక ఉన్న పాత్రదారులు నేటివరకు చిక్కలేదు. తాజాగా కేంద్ర్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుపై తీసుకొన్న నిర్ణయంతో నకిలీ నోట్లు మళ్లీ మార్కెట్‌లో హల్‌చల్ సృష్టిస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి..
వ్యాపారులు, ప్రజలు నకిలీ నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలలి. అనుమానితులు ఇచ్చే నోట్లను ఒకటికి రెండుసార్లు పరిక్షించిన తరువాత తీసుకోవాలి. ప్రతిదుకాణంలో నకిలీ నోట్లను గుర్తించే పరికరాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. నకిలీనోట్లకు సంబంధించి సమాచారం ఉంటే దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.
– కె.నాగేశ్వరరావు, డీఎస్పీ
Advertisement