చంచల్‌గూడ: దేశంలో రూ.1000, రూ.500 నోట్లు రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆర్బీఐ కొత్త రూ. 2 వేలు, రూ. 500, రూ. 200 నోట్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా గత గురువారం పాతబస్తీలోని మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో నకిలీ రూ. 200 నోటు దర్శనమిచ్చింది. మార్కెట్‌లో ఓ వ్యాపారి వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆకు కూరలు కొనుగోలు చేసి రూ. 200 నోటు ఇచ్చి మిగతా డబ్బులు తీసుకుని జారుకున్నాడు.
సదరు వ్యాపారి ఆ రూ.200 నోటును వ్యాపారం చెల్లింపుల్లో భాగంగా మరో వ్యాపారికి ఇవ్వగా నకిలీదిగా గుర్తు పట్టాడు. నోటు సైజ్ తక్కువ, పేపర్ మందం ఎక్కువగా ఉంది. కలర్‌లో వ్యత్యాసం ఉండటంతో పాటు నోటుపై వాటర్ మార్క్ గాంధీ బొమ్మ కూడా లేకపోవడంతో అది ఫేక్ నోటుగా నిర్ధారించుకున్నాడు. దీంతో అసలైన నోటు అని భావించిన వ్యాపారి తాను మోసపోయినట్లు గుర్తు పట్టారు.
వారం క్రితం రూ. 500 నోటు
ఇక్కడే ఈ ఘటనకు వారం రోజుల ముందు కూడా ఇలాగే మరో గుర్తు తెలియని వ్యక్తి రూ. 500 నకిలీ నోటు మార్చేందుకు యయత్నంచగా పసిగట్టిన వ్యాపారి సదరు వ్యక్తితో గొడవపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే నగరంలో నకిలీ రూ. 500, 200 నోట్లు చెలామణిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలీసు, ఎన్‌ఐఏ, బ్యాంక్ అధికారులు మార్కెట్‌లో నకిలీ నోట్ల గుర్తింపుపై ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తే వ్యాపారులు మోసపోకుండా ఉంటారు.
మార్కెట్‌లో పోలీసు స్టేషన్‌కు చెందిన సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలోని ఫుటేజీలను మాదన్నపేట పోలీసులు పరిశీలిస్తే నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయ్యేందుకు అవకాశం లేకపోలేదు. అయితే మాదన్నపేట పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుంటారా లేక, బాధితులు ఫిర్యాదు ఇస్తేనే రంగంలోకి దిగుతారా అనేది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment