చుక్కల్లో...మిర్చి, ఉల్లి ధర | Mirchi, Onion rates on high | Sakshi
Sakshi News home page

చుక్కల్లో...మిర్చి, ఉల్లి ధర

Published Tue, Aug 13 2013 4:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

Mirchi, Onion rates on high

 భువనగిరి, న్యూస్‌లైన్:  కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఉల్లిగడ్డ ధర ప్రస్తుతం రూ.50, మిర్చి రూ.64 పలుకుతుంది. దీనికి తోడు బియ్యం రేటు రోజురోజుకు పెరిగిపోతోంది. సంచుల్లో డబ్బులు తీసుకుపోయి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి రాబోతుందన్న భయం జనాలను వెంటాడుతోంది. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు బెంబేలెత్తుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో కూరగాయలను  పరిమితంగా కొనుగోలు చేసి పొదుపుగా వాడుకుంటున్నారు.

నెల బడ్జెట్‌లో ఇప్పుడు కూరగాయలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. వారంలో రెండు రోజులు గుడ్లు, ఒక రోజు పప్పు, మరో రోజు చికెన్ లేదా మటన్, ఇలా సర్ధుబాటు చేసుకుని మిగిలిన రోజులకు కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. కలిగిన వారు సైతం కూరగాయలను ఫ్రిజ్‌ల నిండా నింపుకునే పరిస్థితికి టాటా చెప్పి మితంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక పేదలు చింతపులుసు, కారంతో రోజులు గడిపేస్తున్నారు. కూరగాయల పంటలు మరికొన్ని రోజుల్లో మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ దశలో మండిపోతున్న ధరలు రైతుల పంటలు మార్కెట్‌లోకి వ చ్చేటప్పుటికి ఉండడం లేదు. దీంతో రైతులు కూరగాయల ధరలపై నిరుత్సాహంగా ఉంటున్నారు. ధరలు పెరిగిన ప్రతిసారీ రైతులు ఆశతో సాగు ప్రారంభిస్తున్నారు. భువనగిరి డివిజన్ పరిధిలో రైతులు పలు రకాల కూరగాయలు పండిస్తారు కానీ ఇప్పుడవన్నీ పంట దశలోనే ఉన్నాయి.

 రూ.42కు చేరిన సన్న బియ్యం
 బీపీటి పాత బియ్యం కేజీ రూ.42లకు చేరింది. నాలుగు నెలల క్రితం అత్యధికంగా కిలో రూ.30 పలికిన ఫైన్ బియ్యం ఇప్పుడు కిలోకు రూ.10 పైనే పెరిగింది. దీంతో పేద, మధ్యతరగతి, సామాన్య జనం సన్న బియ్యం కొనుగోలు చేయాలంటే ధరలు చూసి హడలిపోతున్నారు. సన్న బియ్యం ఆశను తీర్చుకోలేని జనం దొడ్డు బియ్యం, నూకలతోనే సరిపెట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నారు.

 రూ.160లకు కిలో చికెన్
 కిలో చికెన్ ధర రూ.140 నుంచి రూ.160లకు పెరిగింది. 15 రోజుల క్రితం వరకు రూ.130, రూ.140 కిలో ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.160కి చేరింది. శ్రావణమాసం అయినప్పటికీ చికెన్ ధరల పెరుగుదల ఆగడం లేదు. గత 15 రోజులుగా చికెన్ ధర ఇలాగే కొనసాగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement