నీకెంత.. నాకెంత..?
నీకెంత.. నాకెంత..?
Published Sun, Nov 13 2016 6:05 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
–మార్కెట్‌లో ’వైట్ ఫైట్’
ప్రత్యామ్నాయాలపై నల్లదొరల దృష్టి
–తణుకులోనే రూ. వందల కోట్లు!
తణుకుః
నిన్న మొన్నటి వరకు పెద్ద నోట్లు రూపంలో కూడబెట్టుకున్న నల్ల కుబేరులు ఇప్పుడు మోదీ దెబ్బతో కలుగులో ఎలక మాదిరిగా బయటకు వస్తున్నారు. తమ వద్ద మూలుగుతున్న నలుపును తెలుపు చేసుకునేందుకు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. జిల్లాలో సుమారు రూ. 50 వేల కోట్లు మేర నల్లధనం మూలుగుతోందని సమాచారం. అయితే ఇదంతా ఇప్పుడు వైట్‌మనీ చేసుకునేందుకు ఇప్పటికే బ్రోకర్లను రంగంలోకి దించారు. నీకెంత... నాకెంత...? అంటూ బహిరంగంగానే బేరాలు కుదుర్చుకుంటున్నారు. నాదగ్గర రూ. 3 కోట్లు బ్లాక్ ఉంది... ఎంత వైట్ ఇస్తావ్...? ఎంత కమిషన్ కావాలి..? నాకెంత ఇస్తావ్..? అంటూ మధ్యవర్తుల సాయంతో ఇప్పుడు మార్కెట్‌లో ’వైట్‌ఫైట్’ మొదలు పెట్టారు. 20 నుంచి 30 శాతం వరకు కమిషన్‌తో పెద్ద ఎత్తున కరెన్సీ చేతులు మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీను ఎంత మేర బ్యాంకుల్లో వేసుకోవచ్చు...? మిగిలిన డబ్బును ఏం చేయాలంటూ కొందరు ఆడిటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని ఆడిటర్లు... వారి శిష్యులు సైతం బిజీ బిజీగా గడుపుతున్నారు. కనీసం ఫోనులో కూడా అందుబాటులోకి రావడం లేదు.
ఖాతాల్లోకి చేరుతున్న డిపాజిట్లు...
తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఇటీవల జీరో ఖాతాతో ప్రారంభించిన జన్‌ధన్ సేవింగ్ ఖాతాలను ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు. పాసు పుస్తకాలు కలిగిన పేద, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్న కొందరు బడాబాబులు వారికి కమిషన్ ముట్టచెబుతూ వారిఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆదాయపన్ను చెల్లించే వ్యాపారులు రూ. 10 నుంచి రూ. 20 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇలాంటి వారి వివరాలు సైతం సేకరిస్తున్నట్లు సమాచారం. మరికొందరు రూ. 4 వేలు చిల్లర మార్చి ఇస్తే రూ. 200 నుంచి రూ. 300 వరకు కమిషన్ ఇస్తున్నారు. మరోవైపు నల్ల«ధనాన్ని కాపాడుకునే ప్రయత్నంలో కొందరు బంగారం కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. నల్లధనం పరవళ్ల కారణంగా ఇప్పటికే బంగారం ధర రూ. 40 వేలకు చేరింది. ఇటీవల తణుకు పట్టణానికి చెందిన మహిళా రియల్ వ్యాపారి, బంగారం వ్యాపారికి మధ్య తలెత్తిన వివాదం రోడ్డెక్కిన హవాలా వ్యవహారంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే బంగారం వ్యాపారి లావాదేవీలపై ఐటీ శాఖ అధికారులు దృష్టి సారించనట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా అర్థరాత్రి సమయంలో కమర్షియల్ టాక్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహిళా వ్యాపారి వద్ద సైతం వందల కోట్లు మేర నల్లధనం మూలుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేయవచ్చని తెలియడంతో ఒక ప్రయివేటు రంగ సంస్థకు చెందిన బ్యాంకు ద్వారా లావీదేవీలు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
Advertisement