వారసుడు | Father Karunanidhi Ailing, MK Stalin Takes Charge Of DMK, Says 'Not Elated' | Sakshi
Sakshi News home page

వారసుడు

Published Thu, Jan 5 2017 2:15 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

వారసుడు

వారసుడు

►  డీఎంకే పగ్గాలు ‘స్టాలిన్’కు అప్పగింత
► కరుణ హాజరుకాని తొలి సమావేశం
►  కరతాళ ధ్వనులతో శ్రేణుల మద్దతు
► అమ్మకు నివాళి

► రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌

అధినేత కరుణానిధి రాజకీయ వారసుడు ఎంకే స్టాలిన్ కే డీఎంకే వర్గాలు పట్టం కట్టాయి. పార్టీ నిర్వాహక అధ్యక్షుడిగా తమ దళపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సాక్షి, చెన్నై:   అనారోగ్యం, వయోభారం కారణంగా తొలిసారిగా కరుణానిధి హాజరు కాలేని పరిస్థితి నెలకొనడంతో బుధవారం నాటి సర్వసభ్య సమావేశం ఉద్వేగ భరితంగా సాగింది. గతాన్ని నెమర వేసుకుం టూ  సోదరా...పగ్గాలు చేపట్టరావా అని పార్టీ సం యుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ కన్నీటి పర్యంతంతో స్టాలిన్ ను ఆహ్వానించారు. ఈ క్షణంలో స్టాలిన్ తో పాటు ఆ సమావేశంలోని ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు సుడులు తిరగడంతో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, దయాళు అమ్మాల్‌ దంపతుల పెద్దకుమారుడు ఎంకే అళగిరి, చిన్నకుమారుడు ఎంకే స్టాలిన్ ల మధ్య వారసత్వ సమరం ఏళ్ల తరబడి సాగుతూ వచ్చిన విష యం తెలిసిందే. తన రాజకీయ వారసుడు స్టాలిన్  అని కరుణానిధి పదేపదే చెప్పకొచ్చినా, పార్టీకి వారసుడెవ్వరన్న విషయంలో మాత్రం చిక్కులు తప్పలేదు. కరుణానిధి ప్రతినిధిగా, పార్టీ కోశాధికారిగా ప్రజల్లో స్టాలిన్  దూసుకెళ్తున్నా, నాయకత్వ పగ్గాలు ఆయన గుప్పెట్లోకి చేరేదెప్పుడోనన్న ఎదురు చూపులు ఏళ్ల తరబడి డీఎంకేలో సాగుతూ వచ్చాయి.

అదే సమయంలో కరుణానిధిని తప్ప, మరొకర్ని అధ్యక్షుడిగా తాను అంగీకరించబోనని పదే పదే పెద్ద కుమారుడు, బహిష్కృత నేత ఎం అళగిరి స్పష్టం చేస్తుండడంతో వారసత్వ వ్యవహారం ఎలాంటి వివాదాలకు దారి తీస్తాయోనన్న ఉత్కంఠ తప్పలేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్‌ నెలాఖరు నుంచి వయోభారం, అనారోగ్య సమస్యలతో కరుణానిధి గోపాలపురం ఇంటికి, కావేరి ఆసుపత్రికి పరిమితం అవుతుండడంతో పార్టీ నిర్వహణ బాధ్యతలు స్టాలిన్ కు అప్పగించాల్సిన పరిస్థితి. ఇందుకు డీఎంకే వర్గాలు ముక్తకంఠంతో ఆమోదించడంతో నిబంధనల్ని సడలించి మరీ నిర్వాహక అధ్యక్ష పదవికి స్టాలిన్ ను ఎంపిక చేస్తూ, అధ్యక్షుడి వద్ద ఉన్నట్టుగానే అన్ని రకాల అధికారులు అప్పగించడం విశేషం.

ఉద్వేగ భరితంగా : అన్నా అరివాలయం వేదికగా ఉదయం పది గంటలకు డీఎంకే సర్వ సభ్య సమావేశం ప్రారంభమైంది. కరుణానిధి హాజరు అవుతారని సర్వత్రా ఎదురు చూశారు. అయితే, ఆయన రాలేని పరిస్థితి నెలకొనడంతో కరుణ హాజరు కాని తొలి సమావేశంగా సర్వ సభ్యం ఉద్వేగ భరితంగా సాగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్  నేతృత్వంలో సాగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు, సర్వ సభ్య సభ్యులు అందరూ తరలి వచ్చారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా, కార్యక్రమాల విస్తృతం ధ్యేయంగా అన్ని రకాల వ్యవహారాల పర్యవేక్షణకు పార్టీ నిబంధనల్ని సడలిస్తున్నట్టు ఈసందర్భంగా అన్భళగన్  ప్రకటించారు. ఆ మేరకు పార్టీ నిర్వాహక అధ్యక్ష పగ్గాలను స్టాలిన్ కు అప్పగిస్తున్నామని అన్భళగన్  చేసిన ప్రకటనతో ఒక్క సారి అక్కడ కరతాళ ధ్వనులు మార్మోగాయి. నేతలందరూ లేచి నిలబడి మరీ కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు. ఈ సమయంలో అన్భళగన కు పాదాభివందనం చేస్తూ ఆశీస్సుల్ని స్టాలిన్  అందుకున్నారు.

సోదరా పగ్గాలు చేపట్టరావా: అన్భళగన్  తీర్మానానికి మద్దతు పలుకుతూ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్  సాగించిన ప్రసంగం ఉద్వేగాన్ని నింపింది. 1956లో జరిగిన డీఎంకే మహానాడుకు అధ్యక్షత వహించాలని నెడుంజెలియన్ ను అప్పట్లో అన్నా ఆహ్వానించారని గుర్తు చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో నెడుంజెలియన్ ను ఉద్దేశించి ‘తంబి వా...తలమై తాంగ్గు’( సోదరా(తమ్ముడు) అధ్యక్షత వహించవూ..!) అని అన్నా ఆహ్వానించారని, ఇప్పుడు ఆ భాగ్యం తనకు దక్కిందంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఉద్వేగానికి లోనవుతూ సోదరా... అధ్యక్ష పగ్గాలు చేపట్టరావా అని ఆహ్వానించారు. దురై మురుగన్  కన్నీటి పర్యంతానికి తోడు స్టాలిన్ సైతం ఉద్వేగానికి లోను కావడం, సభలో ఉన్న వాళ్లందరి కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరగడం గమనార్హం.

బరువెక్కిన హృదయంతో : ప్రస్తుత పరిస్థితుల కారణంగా అధ్యక్షుడు కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ల మార్గ దర్శకంలో ఈ బాధ్యతను స్వీకరించేందుకు నిర్ణయించినట్టు స్టాలిన్  తన ప్రసంగం ద్వారా వ్యాఖ్యానించారు. ఎన్నికల ద్వారా ఎన్నో పదవులకు ఎన్నికయ్యానని, అప్పుడు కల్గిన మధురానందం, ఇప్పుడు తనకు లేదని, బరువెక్కిన హృదయంతో బాధ్యతను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. బాధ్యతగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

అమ్మకు నివాళి : అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పచ్చ గట్టి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. అయితే, స్టాలిన్  రాజకీయ నాగరికతను చాటే రీతిలో తన పయనాన్ని సాగిస్తున్నారు. 2016లో జరిగిన జయలలిత సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై అందరి దృష్టిలో పడ్డారు. అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు అపోలోకు వెళ్లి మరీ అన్నాడీఎంకే వర్గాల్ని పరామర్శించారు. ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వానికి బాధ్యతగల ప్రతి పక్షంగా అండగా ఉంటామని పదేపదే చెప్పకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ సర్వ సభ్య సమావేశంలో అమ్మ జయలలిత మృతికి సంతాపం తెలియజేస్తూ తీర్మానం చేయడం విశేషం. అలాగే, తుగ్లక్‌ సంపాదకుడు చో రామస్వామి, డీఎంకే నేతలు కోశిమణి మృతికి సంతాపం తెలియజేశారు.

తీర్మానాలు : రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, అన్నదాతల్ని ఆదుకోవాలని, రైతు రుణాల్ని రద్దు చేయాలని, మృతి చెందిన రైతు కుటుంబాలకు సాయం ప్రకటించాలని, నీట్‌ రద్దు చేయాలని, కచ్చదీవుల్లోని అంతోనియార్‌ ఆలయానికి తమిళజాలర్లను అనుమతించాలని సర్వ సభ్య సమావేశంలో తీర్మానాలు చేశారు. అలాగే,  పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తు చేస్తూ కేంద్రం తీరును నిరసిస్తూ, కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.

కరుణ ఆశీస్సులు : కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన స్టాలిన్  నేరుగా గోపాలపురానికి చేరుకుని కరుణానిధి ఆశీస్సుల్ని అందుకున్నారు. అన్భళగన్, దురై మురుగన్  ఈసందర్భంగా స్టాలిన్ వెంట ఉన్నారు. ఇక, అన్నయ్య స్టాలిన్ కు పగ్గాలు అప్పగించడంపై చెల్లెమ్మ, ఎంపీ కనిమొళి ఆనందం వ్యక్తం చేశారు. స్వయంగా అన్నయ్యను ఇంటికి వెళ్లి మరీ కలిసి సత్కరించారు. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్ లతో పాటు డీఎంకే మిత్ర పక్ష పార్టీల నాయకులు, ఇతర పార్టీల నాయకులు స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. స్టాలిన్  నిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. బాణా సంచాలుపేల్చుతూ, స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు.

సీఎంతో భేటీ : సాయంత్రం సచివాలయంలో పార్టీ నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సీఎం పన్నీరు సెల్వంతో స్టాలిన్  భేటీ అయ్యారు. జల్లికట్టు, రైతు ఆత్మహత్యలు, రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలన్న అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement