సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రజాస్వామ్య కూటమి (డీఎఫ్)లో వివాదం మరింత ముదిరింది. ఈ విషయమై అగ్రనాయకులంతా ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య పొత్తు కొనసాగుతుందా? లేదా? అనే సందేహం తలెత్తుతోంది, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఇప్పటికే అనేక విభేదాలున్నాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ల మధ్య కూడా సరిగా పొసగడం లేదనే విషయం అనేకసార్లు బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగుతామని ఇరు పార్టీలు పేర్కొంటున్నాయి.
గతంలో మాదిరిగానే పాత ఫార్ములాతోనే (26-22) బరిలోకి దిగుతామని ఎన్సీపీ నాయకులు ప్రకటిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం కొత్త ఫార్ములా (29-19)తో పోటీ చేయాలని పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయంపాలైన సంగతి విదితమే. ఈ ఫలితాల అనంతరం ఎన్సీపీ ఒక్కసారిగా కాంగ్రెస్‌పై పెద్దఎత్తున దాడికి దిగింది. ఆ పార్టీ నాయకుడు అజిత్‌పవార్ కూడా విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
ఈ విషయమై ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొత్త ఫార్ములాతోనే ముందుకు సాగాలని భావిస్త్తే అన్నిస్థానాల్లో పోటీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించారు కూడా. మరోవైపు ఇదే అంశంపై ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనైనా కొత్త ఫార్ములా కింద కాంగ్రెస్ 29, ఎన్సీపీ 19 సీట్లలో పోటీ చేయాల్సిందేనని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో 2014 ఎన్నికల్లో పొత్తు కుదరడం అంత తేలికేమీ కాదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.ఏదిఏమైనా పొత్తుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్‌లు తుది నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని మరవవద్దని కూడా అంటున్నారు. ఒత్తిడి పెంచడం ద్వారా ఎక్కువస్థానాలను దక్కించుకోవాలనేదే ఇరుపార్టీల వ్యూహంగా కనిపిస్తోంది.
డీఎఫ్‌లో సిగపట్లు
Published Wed, Dec 18 2013 12:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement