ఈసారి మరిన్ని సీట్లు మాకే
ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయిందనే విషయం లోక్‌సభ ఎన్నికలతో తేలిపోయిందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ పేర్కొన్నారు. అందువల్ల వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తమకే మరిన్ని స్థానాలు దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో వారు మాకు తక్కువ సీట్లు ఇచ్చారు. అందువల్ల శాసనసభ ఎన్నికల్లో మాకే మరిన్ని స్థానాలు రావాలి. సీట్ల సర్దుబాటుపై చర్చల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చర్చల విషయంలో ఎక్కువ ఆలస్యం జరగనివ్వం.
శాసనసభ ఎన్నికలకు వీలైనంత త్వరగా సన్నాహాలు చేస్తాం’ అని అన్నారు. మరిన్ని స్థానాల్లో తాము గెలవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడిందన్నారు. ఆహార భద్రత లాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆశించినమేర ఫలితాలు రాలేదన్నారు.
రాష్ట్రంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడంలో ఏడు నెలల మేర ఆలస్యమైందన్నారు. రాజీవ్‌గాంధీ ఆరోగ్యదాయని, స్వల్ప వడ్డీకి రుణాలు వంటి పథకాలు సైతం ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయన్నారు. ఎన్నికల్లో వైఫల్యాలకు గల కారణాలపై చర్చించాల్సి ఉందన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాల్సి ఉందన్నారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ తమ జిల్లాలకు వెళ్లి, ర్యాలీలు, సభలు నిర్వహించాలని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నించాలన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా జరుపుకునేందుకు సంబంధించి తమ పార్టీ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందన్నారు.
కొన్ని వర్గాలు తమకు దూరమయ్యాయనే విషయం ఈ ఎన్నికల్లో తేలిందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎల్‌బీటీ విధానం వల్ల వ్యాపారవర్గాలు తమకు దూరమయ్యాయని ఈ సందర్భంగా ఉదహరించారు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయాలని షాహు మహారాజ్ వంటి మహానుభావులు పేర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
కాగా 2009 నాటి శాసనసభ ఎన్నికల్లో ఎన్సీపీ 114, కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీచేశాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నాలుగు స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ కేవలం రెండింటికే పరిమితమైన సంగతి విదితమే.