ఆధిపత్య పోరు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తండ్రీ, తనయుల మధ్య రూ.16వేల కోట్ల ఆస్తులు ఆధిపత్య పోరుకు దారితీశాయి. ఈ వ్యవహారంలో లంచానికి పాల్పడిన అత్యంత ఉన్నత స్థాయి అధికారి జైలు పాలయ్యూరు. ఇందుకు సంబంధించి పోలీసులు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెట్టినాడు గ్రూపు సంస్థల కింద అనేక ఆఫీసులు, పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటికి ఎంఏఎమ్ రామస్వామి అధిపతిగా ఉన్నారు. ఇతనికి పిల్లలు లేకపోవడంతో అయ్యప్పన్ అనే బాలుడిని దత్తపుత్రుడిగా స్వీకరించారు. అయ్యప్పన్‌ను పెంచి, పెళ్లి కూడా చేశారు. రామస్వామి తన ఆస్తుల్లో కొంత భాగాన్ని ఒకసారి, మిగిలిన భాగాన్ని మరోసారి అయ్యప్పన్ పేరున రాశారు. పూర్తిగా ఆస్తులు తనపేరున మారగానే అయ్యప్పన్ చెన్నైలోని కేంద్ర కార్యాలయాన్ని ముంబైకి మార్చారు.
అలాగే తన నివాసాన్ని సింగపూర్‌లో పెట్టారు. రామస్వామి మాత్రం చెన్నై అభిరామపురంలో ఒంటరిగా ఉంటున్నారు. ఈ దశలో గ్రూపు సంస్థలపై పెత్తనం ఎవరిదనే వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదంపై తండ్రీ కొడుకులిద్దరూ కేంద్ర రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ, చెన్నై) కార్యాలయంలో పిటిషన్ దాఖలు చేశారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా రిజిస్ట్రార్ మనునీది చోళన్‌ను కేంద్రం కార్యాలయం మధ్యవర్తిగా నియమించింది. కంపెనీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం ద్వారా అధిపతి ఎవరో తేల్చుకోవాలని కంపెనీలోని వాటాదారులు అభిప్రాయపడ్డారు. ఈనెల 27వ తేదీన సర్వసభ్య సమావేశం జరపాలని నిర్ణయించారు.
మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రిజిస్ట్రార్ మనునీది చోళన్ సర్వసభ్య సమావేశంలో తనకు అనుకూలంగా వ్యవహరించేలా రామస్వామి ప్రయత్నాలు చేస్తున్నట్లు, రూ.10 లక్షలు లంచం ఇచ్చేందుకు సిద్దమైనట్లు అయ్యప్పన్‌కు ఎవరో సమాచారం అందించారు. ఈ విషయాన్ని అయ్యప్పన్ సీబీఐ అధికారలకు చేరవేశారు. రూ.10 లక్షలు పుచ్చుకునేందుకు అంగీకరించిన రిజిస్ట్రార్ మనునీది చోళన్ అభిరామపురంలోని రామస్వామి ఇంటికి వెళ్లి కారులో వెళుతుండగా సీబీఐ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. కారులోని రూ.10 లక్షలు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. నార్త్‌ఉస్మాన్‌రోడ్డులోని ఆయన ఇంటిని సోదాచేసి రూ.20 లక్షల నగదు, కంప్యూటర్ డిస్క్‌లు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే అంతా సంఘంలో పేరు, పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో సీబీఐ జాయింట్ డెరైక్టర్ అరుణాచలం, ఎస్పీ రూపా తదితరులు అత్యంత గోప్యాన్ని పాటించారు. కనీసం స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులకు సైతం వివరాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. విషయం పొక్కకుండా ఉండేందుకు మనునీది చోళన్‌ను అనేక చోట్లకు మారుస్తూ విచారణ జరిపారు. నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో బుధవారం తెల్లవారుజాము 5.30 గంటల వరకు విచారించారు. ప్రాథమిక విచారణ పూర్తికావడంతో మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో చోళన్‌ను మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి కృష్ణమూర్తి ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించారు.
నిందితుడిని వారం రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించాల్సిందిగా సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే చోళన్ సైతం బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఈ రెండు పిటిషన్లను న్యాయమూర్తి గురువారానికి వాయిదావేశారు. కోర్టు రిమాండ్‌తో పుళల్ జైలు ఖైదీగా మారిన రిజిస్ట్రార్ మనునీది చోళన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. లంచం ఇచ్చిన నేరానికి రామస్వామిపై కూడా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియడంతో రామస్వామి గుండెపోటుకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పదేళ్లలో 79 వేల లంచం కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. లంచం కేసులో ఉన్నతాధికారుల అరెస్ట్ విషయానికి వస్తే మండల పాస్‌పోర్టు అధికారి సుమతీ రవిచంద్రన్, కస్టమ్స్ అధికారి రాజన్ తర్వాత చోళన్ మూడోస్థానం పొందారు.