
నటుడి సాఫ్ట్‌వేర్ సంస్థలో అగ్నిప్రమాదం
కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధం ఆళ్వార్‌పేటలో ఘటన
టీనగర్: ఆళ్వార్‌పేటలో నటుడు అరవింద్‌స్వామికి సొంతమైన సాఫ్ట్‌వేర్ సంస్థలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో వందకు పైగా కంప్యూటర్లు, ఫర్నిచర్ సామగ్రి దగ్ధమయ్యాయి. ఆళ్వార్‌పేట సీపీ రామసామి రోడ్డులో ఆక్స్‌ఫర్డ్ పేరిట మూడంతస్తుల భవనం ఉంది. రెండోఅంతస్తులో సినీనటుడు అరవింద్‌స్వామికి చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ ఉంది. ఈ సంస్థ నుంచి మంగళవారం ఉదయం హఠాత్తుగా పొగలు వచ్చాయి.
కొద్ది సేపట్లోనే మంటలు వ్యాపించడంతో అక్కడున్న వాచ్‌మన్ వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈలోపు సంస్థలో ఉన్న 100కు పైగా కంప్యూటర్లు, వాటికి అవసరమైన పరికరాలు, ఫర్నీచర్లు మంటల్లో కాలిపోయాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఏసీ మిషన్ నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.