సాక్షి,బెంగళూరు : శీతాకాల శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే సువర్ణ విధానసౌధను ముట్టడించే ప్రయత్నం చేయడం ద్వారా విపక్ష బీజేపీ అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రైతులు, ప్రజల మద్దతును పొందే ప్రయత్నం చేయడంతో పాటు పార్టీ నాయకుల మధ్య ఉన్న ఐక్యతను కూడా ప్రదర్శించింది. శీతకాల సమావేశాల ప్రారంభమైన మంగళవారం తెల్లవారుజాము నుంచే బెళగావి, హుబ్లీ, ధారవాడ, గదగ్, హావేరి, రాయచూరు, దావణగెరే, శిమొగ్గ, కొప్పళతో సహా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, రైతులు సువర్ణ విధానసౌధకు కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన బృహత్ వేదిక వద్దకు చేరుకోవడం మొదలు పెట్టారు.
ఇక ఉదయం 11 గంటల కల్లా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జ్యోషి, బీజేపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధరరావు, సీనియర్ నాయులు కే.ఎస్ ఈశ్వరప్ప, సురేష్‌అంగడి, శ్రీరాములు తదితరులు వేదిక వద్దకు చేరుకోగానే అక్కడి పరిస్థితి వేడెక్కింది. బీజేపీ కార్యకర్తలు, ప్రజలు, రైతు సంఘం నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. చెరుకు రైతులకు ప్రకటించిన మద్దతు ధర ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కంది, వరి, జొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా యడ్యూరప్ప ధర్నాకు వచ్చిన కార్యకర్తలను, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం ఘాడనిద్రలో ఉందని ఎద్దేవ చేశారు. అందువల్లే ప్రజల కష్టాలు వారికి తెలియడం లేదని విమర్శించారు. అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోయిన వారికి వెంటనే పరిహారం చెల్లించాలి డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు మంది మంత్రులను వెంటనే మంత్రిమండలి నుంచి తొలగించాలని ప్రహ్లాద్‌జ్యోషి డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తాము నిరసన వ్యక్తం చేస్తుంటే సిద్ధరామయ్య ప్రభుత్వం దీన్ని అణచడానికి ప్రయత్నిస్తూ హిట్లర్, తుగ్లక్‌ల నాటి పరిస్థితులను సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని జగదీష్ శెట్టర్ విమర్శించారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలు, రైతులతో కలిసి బీజేపీ నాయకులు సువర్ణ విధానసౌధను ముట్టడించడానికి వెళ్లడానికి వెళ్లారు. దీంతో భద్రతా చర్యల్లో భాగంగా అక్కడే ఉన్న పోలీసులు యడ్యూరప్ప, శోభకరంద్లాజెతో సహా సుమారు 20 మంది శాసనసభ్యులు, వందల మంది రైతు సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ నాయకులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా లెక్కచేయని పోలీసులు నాయకులను వేర్వేరు వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. తర్వాత సొంత పూచికత్తుపై విడిచిపెట్టారు. అనంతరం బీజేపీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మురళీధరరావు మాట్లడుతూ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నారన్నారు. ఆయన మరెంతో కాలం ఆ పదవిలో కొనసాగలేరని జోష్యం చెప్పారు.
మరోవైపు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సువర్ణ విధానసౌధ చుట్టు పక్కల ధర్నా నిర్వహిస్తున్న రైతు సంఘం నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలి పెట్టారు. ఇది ఇలా ఉండగా రాష్ర్ట చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు కరుబూరు శాంతకుమార్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ధర్నాను ఉపసంహరించుకునే విషయాన్ని సహచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అంతకు మందు సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ రెండు, మూడు చోట్లకు స్వయంగా వెళ్లి రైతు సంఘం నేతలతో మాట్లాడి ధర్నాను విరమింపజేయడానికి విఫలయత్నం చేశారు.
మద్దతు ధరపై మండిపాటు
Published Wed, Dec 10 2014 4:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement