‘ఆధార్’ పేరుతో రూ.3,500 కోట్ల ప్రజాధనం వృథా : వెంకయ్య
సాక్షి, బెంగళూరు : ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘తుగ్లక్’ బాట పట్టిందని బీజేపీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని టీ అమ్మడానికి రావాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఆహ్వానించినందుకు నిరసనగా బెంగళూరులో శనివారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత టీ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. వంట గ్యాస్‌ను సబ్సిడీపై పొందడానికి ఆధార్ విధిగా ఉండాలని చెబుతూ వచ్చిన ప్రభుత్వం, ఉన్నట్లుండి అవసరం లేదంటూ మాట మార్చిందని విమర్శించారు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన రూ.3,500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు కాదా అని ప్రశ్నించారు. టీ అమ్మకం ద్వారా జీవితంలో ఎదిగిన మోడీ ప్రధాని కావడంలో తప్పేముందని నిలదీశారు.
కాగా భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో తృతీయ ఫ్రంట్‌కు స్థానం లేదన్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.630 కోట్లు ఖర్చు చేయడం సరికాదన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాల్సి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి రావడం, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ నియోజక వర్గాల స్థాయిలో సమావేశాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదో తుగ్లక్ పాలన
Published Sun, Feb 2 2014 3:03 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement
Advertisement