మంత్రుల గుండెల్లో రైళ్లు
పనిచేయనివారికి ఉద్వాసన
యువ ఎమ్మెల్యేలకు పదవులు
త్వరలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ
సిద్ధు యోచన
21న ఢిల్లీకి సీఎం
బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ అమాత్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ పర్యటన తర్వాత మంత్రి వర్గ విస్తరణతో పాటు పునర్‌వ్యవస్థీకరణ కూడా ఉండబోతోందన్న సమాచారంతో వారికి కునుకు పట్టడం లేదు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకె ళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఇటీవల బెంగళూరులో మాట్లాడుతూ త్వరలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ, విస్తరణ’ ఉంటుంది. అని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది. ఈ నెలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లినా ఎన్నికల హడావుడిలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువరాజు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ సిద్ధుకు దొరకలేదు.
ఎన్నికల ప్రక్రియ ముగియడమేకాకుండా రేపు (గురువారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మంత్రి వర్గ విస్తరణ విషయమై చర్చించడానికి సిద్ధును ఢిల్లీ రావాల్సిందిగా సూచన అందినట్లు సమాచారం. దీంతో సిద్ధు ఈనెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే సమయంలో గత మూడేళ్లల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా సిద్ధు హై కమాండ్‌కు నివేదిక రూపంలో అందజేయనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ మార్పులు తదితర విషయాల పై చర్చించడానికి వీలుగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ.పరమేశ్వర్ కూడా ఈనెల 21న ఢిల్లీ వెళ్లనున్నారు.
సీనియర్ మంత్రులపై వేటు...
మంత్రి మండలి పునఃరచన, విస్తరణలో సీనియర్ మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వమోభారంతో బాధపడుతుండటం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న విషయం తలిసిందే. దీంతో ఈ రెబల్‌స్టార్ కూడా ‘తొలగింపు’ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇలా ప్రస్తుతం మంత్రి మండలిలో ఉన్న దాదాపు 10 మందిని తొలగించి ఆ స్థానంలో యువ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని సిద్ధరామయ్య ఆలోచన. అంతేకాకుండా మరికొందరు సీనియర్‌లను సైతం మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా వారి శాఖలను మార్చాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్‌లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
‘మేడం, యువరాజు’ ఆమోదం కూడా...
మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను అప్పగించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిద్ధరామయ్యను గతంలోనే ఆదేశించారు. ఆమేరకు సిద్ధరామయ్య నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నూతన నివేదిక పై మేడం, యువరాజుతోతో సీఎం సిద్ధరామయ్య ఆమోద ముద్ర వేయించుకుని రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మంత్రి పదవుల పై ఆశలు పెట్టుకున్న మోటమ్మ, మాలికయ్యగుత్తేదార్ వంటి సీనియర్ నాయకులు కూడా ఢిల్లీలో మకాం వేసి జోరుగా లాబియింగ్ జరుపుతున్నారు.