సాక్షి, ముంబై: మేనేజ్‌మెంట్ గురుగా పేరు సంపాదించుకున్న ‘ముంబై డబ్బావాలా’ల ఆరోగ్యంపై బీఎంసీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటోంది. నెలకు ఒకసారి ఉచితంగా వైద్య సేవలు అందించే ప్రతిపాదనకు బీఎంసీ మహాసభలో ఆమోదముద్ర వేసింది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయం సేకరించేందుకు త్వరలో బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే దగ్గరకు పంపించనున్నారు. ఆ తర్వాత ఆమోద ముద్ర వేయగానే డబ్బావాలాలకు వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. దీనిప్రకారం బీఎంసీ డబ్బావాలాల కోసం ప్రత్యేకంగా ఒక ఆరోగ్య కేంద్రాన్ని స్థాపించి నెలకు ఒకసారి ఉచితంగా వైద్య సేవలు అందించనుంది. నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మధ్యాహ్నం భోజన వేళకు ఇంటి నుంచి తీసుకొచ్చిన టిఫిన్ బాక్స్‌లను అందజేస్తారు. ఉదయం నుంచి నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉద్యోగుల ఇళ్ల నుంచి టిఫిన్ బాక్స్‌లు సేకరిస్తారు.
ఈ పనులు 1890 నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు ఐదు వేలకుపైగా డబ్బావాలాలు రెండు లక్షల మంది ఉద్యోగులకు టిఫిన్ బాక్స్‌లు అందజేస్తారు. టిఫిక్ బాక్స్‌లు సేకరించాలంటే అందుకు మురికివాడల ప్రాంతాలను సైతం దాటి వెళుతుంటారు. దీంతో అంటువ్యాధులు సోకి వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. టిఫిన్ బాక్స్‌లు సమయానికి చేరవేయాలనే ధ్యాసలో తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ఎండలో తిరగడంవల్ల వడదెబ్బ, వర్షా కాలంలో అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని ఎమ్మెన్నెస్ కార్పొరేటర్ దీపక్ పవార్ కార్పొరేషన్ మహాసభలో లేవనెత్తారు. డబ్బావాలాల ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన బాధ్యత బీఎంసీ పరిపాలన విభాగంపై ఎంతైనా ఉందని ఆయన వాదించారు. అందుకు అంగీకరించిన ఆరోగ్య శాఖ కార్పొరేషన్ ఆస్పత్రుల్లో వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
డబ్బావాలాలకు ఉచిత వైద్య సేవలు!
Published Tue, Sep 24 2013 1:12 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement