గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన జి.సుబ్బారావుకు 69 ఏళ్లు. కొద్ది రోజులుగా కంటి చూపు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే సెకండరీ కేర్ ఆస్పత్రికి.. లేదంటే గుంటూరులోని పెద్దాస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి రావడానికి ప్రయాణచార్జీలు, ప్రయాసల భారం తప్పనిసరి. అయితే ఇవేవీ లేకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష(జేఏఎస్) కార్యక్రమం ద్వారా గ్రామంలోనే సుబ్బారావుకు ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించింది.
ఈ నెల ఐదో తేదీన రెండో దశ జేఏఎస్‌లో భాగంగా గ్రామంలో వైద్య శాఖ సురక్ష వైద్య శిబిరం నిర్వహించింది. ర్యాండమ్ బ్లడ్ షుగర్, రక్తపోటుతో పాటు, విజన్ టెస్ట్‌లను గ్రామంలోనే ఉచితంగా నిర్వహించారు. విజన్ టెస్ట్‌లో గుర్తించిన అంశాల ఆధారంగా చూపు సమస్య నివారణకు ప్రభుత్వమే ఉచితంగా చికిత్స అందించింది.
సాక్షి, అమరావతి: సుబ్బారావు తరహాలోనే రాష్ట్రంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి జేఏఎస్ కార్యక్రమం వరంగా మారింది. సమయం, ఓపిక లేని, ఆర్థిక పరిస్థితులు సహకరించని, అదే పనిగా ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోలేని లక్షలాది మంది ఆరోగ్య సమస్యలను జేఏఎస్ పరిష్కరిస్తోంది. గ్రామ స్థాయిలోనే స్పెషలిస్ట్ వైద్యులు ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తున్నారు.
మందులు అవసరమైతే అక్కడికక్కడే ఉచితంగా అందిస్తున్నారు. మెరుగైన చికిత్సలు అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. రిఫరల్ కేసుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభుత్వమే మందులను డోర్ డెలివరీ చేస్తోంది.
4.19 లక్షల మందికి ఉచిత వైద్యం
రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని ఈ నెల రెండో తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ఒక జిల్లాలోని మండలాలను రెండుగా విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలుంటాయి. ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలు నిర్వహించేలా కార్యాచరణతో ముందుకెళుతున్నారు.
కాగా, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,315 సురక్ష వైద్య శిబిరాలు నిర్వహించగా.. సగటున 319 మంది చొప్పున 4,19,249 మంది స్వగ్రామం, వార్డుల్లోనే చికిత్సలు అందుకున్నారు. నంద్యాల జిల్లాలో 56 శిబిరాలు నిర్వహించగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ సగటున 458 ఓపీలు నమోదు కావడం విశేషం. ఇక ఇప్పటి వరకూ జేఏఎస్–2లో వైద్య సేవలు పొందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 4.19 లక్షల మంది సేవలు పొందగా.. వీరిలో 2.19 లక్షల మంది మహిళలు, 1.99 లక్షల మంది పురుషులున్నారు.
మూడు వేల మంది స్పెçషలిస్ట్ వైద్యులతో
ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెండో దశ ఆరోగ్య సురక్ష నిర్వహించేలా వేగంగా అడుగులు వేస్తున్నారు. జనవరిలో 3,583 శిబిరాలను నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 1,315 శిబిరాలు పూర్తయ్యాయి. ఇక షెడ్యూల్ ప్రకారం గ్రామం/వార్డులో సురక్ష శిబిరం ఏర్పాటుకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు రెండో సారి వలంటీర్‌లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జేఏఎస్–2 పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు, ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు.
ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్‌లు మూడు వేల మంది వరకూ వైద్యులను, కంటి సమస్యల గుర్తింపునకు స్క్రీనింగ్ చేపట్టడానికి 562 పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను డిప్లాయ్ చేశారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు.
268 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు చేయించాం
తొలి ఆరోగ్య సురక్షలో మా పీహెచ్‌సీ పరిధిలో 111 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేశాం. వారిలో 72 మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు పూర్తయ్యాయి. ఇక 306 మందిలో కంటి సమస్యలను గుర్తించాం. వీరిలో 268 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు పూర్తయ్యాయి. మిగిలిన వారు పొలం పనుల కారణంగా చికిత్సలు, క్యాటరాక్ట్ సర్జరీలను వాయిదా వేసుకున్నారు. వారికి కూడా వీలైనంత త్వరగా చికిత్సలు పూర్తి చేసేలా ఫాలోఅప్ చేస్తున్నాం. – డాక్టర్ సుశ్మప్రియదర్శిని, మెడికల్ ఆఫీసర్, వత్సవాయి పీహెచ్‌సీ, ఎన్టీఆర్ జిల్లా
ఆరోగ్యశ్రీ కింద స్టంట్ వేశారు
గతేడాది మా ఊళ్లో ప్రభుత్వం సురక్ష శిబిరం నిర్వహించింది. ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతున్న నేను శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించుకున్నాను. ఈసీజీ తీశారు. ఈ క్రమంలో గుండెకు సంబంధించి సమస్య ఉన్నట్టు గుర్తించారు. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్లగా.. రక్తనాళాలు పూడుకుని పోయినట్టు గుర్తించి స్టంట్ వేశారు. – భారతీలక్ష్మి, దబ్బాకుపల్లి, ఎన్టీఆర్ జిల్లా
చేయి పట్టి నడిపిస్తూ
వైద్య శిబిరాల ద్వారా స్వగ్రామాల్లోనే వైద్య సేవలు అందించడమే కాకుండా అనంతరం కూడా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయిపట్టి ముందుకు నడిపించనుంది. జేఏఎస్ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తున్నారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున పంపిణీ చేస్తోంది.
ఈ క్రమంలో రిఫరల్ రోగులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్‌లు, ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్‌లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వీరికి ఉచిత కన్సల్టేషన్‌లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది.
జగనన్న ఆరోగ్య సురక్ష తొలి దశలో అందించిన సేవలు
ఆరోగ్య సిబ్బంది సందర్శించిన గృహాలు 1,45,35,705
నిర్వహించిన వైద్య పరీక్షలు 6,45,06,018
నిర్వహించిన మొత్తం సురక్ష శిబిరాలు 12,423
(రూరల్–10,033, అర్బన్–2,390)
శిబిరాల్లో నమోదైన ఓపీలు 60,27,843
తదుపరి వైద్యం కోసం నెట్‌వర్క్ ఆస్పత్రులకు రిఫరల్ 1,64,982 మంది
Comments
Please login to add a commentAdd a comment