ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఆపై కిడ్నాప్
మంగళూరు: ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ బాలికను బుట్టలో పడేశాడు. కలుద్దామని చెప్పి పిలిపించి ఆమెను కిడ్నాప్ చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళూరులోని స్టేట్‌బ్యాంకు సమీపంలో ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయికి, అదే ప్రాంతానికి చెందిన షబ్బీర్(24) అనే యువకుడు ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు.
అవి నమ్మిన ఆ అమ్మాయి ఈ నెల 9 న స్కూల్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి మొదటిసారి షబ్బీర్‌ను కలవడానికి వెళ్లింది. చీకటి పడుతున్నా కుమార్తె ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విద్యార్థిని ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో ఓ ఇంటిలో బాధితురాలు నిర్బంధానికి గురైనట్లు గుర్తించారు. ఈ నెల 11న బాలికను విడిపించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. షబ్బీర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా స్నేహితులు షాకీర్, అజార్ సహాయంతో బాలికను కిడ్నాప్ చేసినట్టు అంగీకరించాడు. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.