సీఎం సిద్ధరామయ్యతో పాటు మరో ఐదుగురు మంత్రులపై లోకాయుక్తలో ఉన్న కేసుల నుంచి బయట పడేందుకే....
ప్రభుత్వం ‘ఏసీబీ’ ఏర్పాటు చేయడంపై హీరేమఠ్ వ్యాఖ్యలు
బెంగళూరు: సీఎం సిద్ధరామయ్యతో పాటు మరో ఐదుగురు మంత్రులపై లోకాయుక్తలో ఉన్న కేసుల నుంచి బయట పడేందుకే (యాంటీ కరప్షన్ బ్యూరో-ఏసీబీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సమాజ పరివర్తనా సంస్థ ప్రతినిధి ఎస్.ఆర్.హీరేమఠ్ ఆరోపించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీబీ ఏర్పాటు ద్వారా లోకాయుక్త సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయనుందని, తద్వారా సీఎంతో పాటు ఐదుగురు మంత్రులపై లోకాయుక్తలో ఉన్న కేసులను లోకాయుక్త నుండి ఏసీబీకి బదలాయించి ఆయా కేసుల నుండి బయటపడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహమని ఆరోపించారు. లోకాయుక్తలో ఉన్న 700 కేసులను సైతం ఇప్పటికే ఏసీబీకి బదలాయించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. త్వరలో ఏసీబీ ఏర్పాటుపై కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.