చిల్లర బాధలకు చెల్లు!!
Published Thu, Mar 6 2014 10:18 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
న్యూఢిల్లీ: బస్సు ఎక్కిన తర్వాత చిల్లర లేదనో... టికెట్ పోగొట్టుకున్నామనో... ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. జేబులోనుంచి స్మార్ట్ కార్డు తీసి కండక్టర్ వద్దనున్న ఎలక్ట్రానిక్ మిషన్‌పై స్వైప్ చేసి, ఎక్కడికి వెళ్లాలో చెబితే చాలు.. ప్రశాంతంగా గమ్యానికి చేరుకోవచ్చు. టికెటింగ్, పేపర్ పాస్‌లు, కరెన్సీ వ్యవస్థకు స్వస్తి చెబుతూ ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టమ్(డీఐఎంటీఎస్) బస్సుల్లోనూ స్మార్ట్‌కార్డులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ప్రయోగాత్మకంగా ముందు మిలీనియమ్ డిపో బస్సులో ఈ కార్డులను ప్రవేశపెట్టాలని డీఐఎంటీఎస్ నిర్ణయించింది. త్వరలో తమ బస్సుల్లో ఈ కార్డులు అందుబాటులోకి రానున్నాయని మిలీనియమ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తెలిపారు. ‘ఈ స్మార్ట్ కార్డులు దాదాపుగా డెబిట్ కార్డుల్లా పనిచేస్తాయి.
కండక్టర్ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ రీడర్‌పై దీనిని స్వైప్ చేయాలి. ఎక్కడికి వెళ్లాలో చెబితే ఆ ప్రాంతానికి సంబంధించిన కోడ్‌ను కండక్టర్ ఎంటర్ చేస్తాడు. దీంతో కార్డులో నిల్వ ఉన్న నగదులోనుంచి ప్రయాణ చార్జీ తగ్గుతుంది. ఇందుకోసం కొంతమందితో కలిసి ఇటీవల ప్రయోగాత్మకంగా పరిశీలించాం. మెట్రో స్మార్డ్ కార్డులకు, వీటికి చాలా తేడా ఉంది. స్టేషన్లలో ఉండే యంత్రాలపై మెట్రో కార్డులను స్వైప్ చేసి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
కానీ కదిలే బస్సుల్లో ఈ యంత్రాల ఏర్పాటు అసాధ్యం. అందుకే కండక్టర్ వద్ద ఉండే ఎలక్ట్రానిక్ రీడర్‌పై స్వైప్ చేస్తే చాలు. అయితే ఈ యంత్రంపై కేవలం వెళ్లాల్సిన గమ్యాన్ని ఎంటర్ చేస్తే చాలు. ఈ కార్డులు అమల్లోకి వస్తే కాగితపు టికెట్లు, పాస్‌లను రద్దు చేస్తాం. ప్రతిరోజూ జేబులో చిల్లర ఉన్నాయో? లేదో? ప్రయాణికులు ఎందుకు చూసుకోవాలి? ప్రతిరోజూ బస్‌పాస్‌ను ఎందుకు కొనుక్కోవాలి? ప్రశాంతంగా మొబైల్ నుంచి తమ స్మార్ట్ కార్డులో సమయమున్నప్పుడు బ్యాలెన్స్ వేసుకుంటే సరి... ఇక ఎటువంటి చింతాలేని బస్సు ప్రయాణం ఎంజాయ్ చేయవచ్చ’ని డీఐఎంటీఎస్ చీఫ్ సహాయ్ తెలిపారు.
Advertisement
Advertisement