
ఇలాంటోడు ఊరికి ఒక్కడుంటే చాలు!
నాసిక్: గ్రామంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి కట్టించాకే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడా గ్రామ సేవకుడు. మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం నెరవేరడంతో శుక్రవారం నాడు తన సొంత గ్రామం లాతూర్ జిల్లాలోని సంగం గ్రామంలో పెళ్లి పీటలెక్కాడు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో హేవరి గ్రామానికి గ్రామ సేవకుడిగా పనిచేస్తున్న కిశోర్ విభూతే.
స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొందిన కిశోర్ గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండకూడదని భావించాడు. 2014 నాటికి గ్రామంలో ఉన్న 351 ఇళ్లకుగానూ 174 ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. మిగతా 177 ఇళ్లలో కూడా మరుగుదొడ్లు నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని నాసిక్‌లో జరిగిన ఓ సమావేశంలో శపథం చేశాడు. మరుగుదొడ్ల నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయినా నాసిక్ జిల్లా యంత్రాంగం గురువారం తనిఖీ చేసి అధికారికంగా గుర్తింపు ఇవ్వడంతో కిశోర్ లక్ష్యం పూర్తయ్యింది.