దేవుడిచ్చిన గిఫ్ట్ హన్సిక
ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే సంస్కృతికి చిల్లులు పడుతున్నాయని నటుడు జయం రవి పేర్కొన్నారు. మడ్రాస్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎస్ నందగోపాల్ నిర్మించిన చిత్రం రోమియో జూలియట్. జయం రవి, హన్సిక జంటగా నటించిన ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో నటి పూనం బాజ్వా నటించారు. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.
విలేకరుల సమావేశంలో దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ జయంరవి వల్లే రోమియో జూలియట్ చిత్రం రూపొందిందన్నారు. ఆయన తనకు దేవుడితో సమానంగా వ్యాఖ్యానించారు. అదే విధంగా ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించడం దేవుడిచ్చిన గిఫ్ట్ భావిస్తున్నానన్నారు. చిత్ర కథ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు జయం రవి బదులిస్తూ రోమియో జూలియట్ అనగానే చాలామంది ఇంకేదో ఊహించుకుంటారన్నారు.
ఈ కాలంలో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకునే సంస్కృతి మారుతోందన్నారు. ఒకవేళ ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకున్నా ఆమెతో చివరి వరకు జీవించడమనే వారి సంఖ్య తగ్గుతోందని అన్నారు. అలాంటి సంస్కృతి తప్పు అని చెప్పే చిత్రం రోమియో జూలియట్. ప్రేమించి పెళ్లి చేసుకునేవారు ఒకరికి ఒకరుగా జీవించాలని చెప్పే చిత్రం ఇది అని తెలిపారు. ఇందులో తన పాత్ర ఇంచుమించు రాముడిలా ఉంటుందన్నారు. హన్సికది సీత లాంటి పాత్ర! అన్న ప్రశ్నకు అంతేకదా! అన్నారు. రోమియో జూలియట్ అభిమానుల అంచనాలను పూర్తి చేసే చిత్రంగా ఉంటుందని హన్సిక అన్నారు.