హన్సికతో ఆ కోరిక తీరేనా?
కోరికలు అందరికి ఉంటాయి.అయితే వాటిని నెరవేర్చుకునే దారే వెతెక్కోవాలి. చిత్రపరిశ్రమ విషయానికొస్తే యువ తారలు ప్రముఖ నటీనటులతో నటించాలని ఉవ్విళ్లూరుతుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా అందుకు ప్రయత్నిస్తుంటారు. హీరోయిన్లే కాదు హీరోలు ఇందుకు అతీతం కాదు. మొదట్లో వర్ధమాన నటీమణులతో నటించిన యువ నటులు ఒకటి రెండు విజయాలు దరి చేరగానే క్రేజీ హీరోయిన్లతో జతకట్టాలని ఆశ పడుతుంటారు. నటుడు శివకార్తికేయన్ ఆ మధ్య మాన్‌కరాటే చిత్రంలో నటి హన్సికతో నటించారు.అప్పట్లో హన్సికతో శివకార్తీకేయనా? అంటే ఒక వర్గం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ చిత్రం హిట్ అయి వాళ్లనోళ్లు మూయించింది. అయితే శివకార్తికేయన్‌కు మాత్రం నటి నయనతారతో నటించాలనే కోరికను రేకెత్తించింది. తదుపరి చిత్రం ఆమెతో నటించే ప్రయత్నం చేశారు కూడా. అయితే నయనతారే ఓకే అనలేదు.
సరిగ్గా నటుడు విజయ్‌సేతుపతికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. పిజ్జా, నడువుల కొంచెం నడువుల కానోమ్, ఇదర్కుదానే ఆశపట్టాయ్ బాలకుమారా, తదితర చిత్రాల వరుస విజయాలతో నటుడిగా ఎదుగుతున్న ఈయన ఇప్పటి వరకూ రమ్యానంబీశన్, ఐశ్వర్య రాజేష్, నందిని తదితర వర్ధమాన హీరోయిన్లతోనే నటించారు. ఇంకా ఎంత కాలం ఇలా చిన్న హీరోయిన్లతో నటించాలి అని అనుకుంటున్న సమయంలో తాజాగా నయనతారతో రొమాన్స్‌చేసే అవకాశం వచ్చింది. నటుడు ధనుష్ నిర్మిస్తున్న నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నయనతారతో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ సమయంలో నేను నయనతారకు వీరాభిమానిని అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఫ్లాట్ అయిపోయిన నయనతార ఇతర ప్రముఖ నటులతో నటించినట్లుగానే విజయ్‌సేతుపతితోనూ సన్నిహితంగా నటించారని కోలీవుడ్ ప్రచారం.
ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా ఇటీవల నవ నిర్మాతలు విజయ్ సేతుపతితో చిత్రం చేయాలని వెళ్లగా నటి హన్సికను హీరోయిన్‌గా బుక్ చేయమన్నారట. వేరే దారిలేని ఆ నిర్మాతలు హన్సిక కోసం ప్రయత్నించగా ఆమె సారీ కాల్‌షీట్స్ లేవని చెప్పారట. ఇదే మాటను నిర్మాతలు విజయ్‌సేతుపతి చెవిలో వేయగా ఓ అలాగా ఓకే టేకిట్ ఈజీ తరువాత చిత్రానికి ట్రై చేద్దాం అని కూల్‌గా అన్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. నయనతారతో నటించాలనే శివకార్తికేయన్ కోరికే ఇప్పటికి తీరలేదు. ఇక విజయ్‌సేతుపతి ఆశ నెరవేరేదెప్పుడో?