
హనుమంత లాడ కాల్చివేత
బెంగళూరు : వ్యక్తిగత కారణాలతో ఓ మాజీ జెట్పీటీసీ సభ్యుడ్ని పట్టపగలు తుపాకీతో కాల్చి చంపిన ఘటన బీదర్ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... హనుమంతలాడ (58) బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో బీదర్‌లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఎటీఎంలో డబ్బులు తీసుకుని ఆటోలో మరోచోటికి బయలుదేరాడు. అదే సమయంలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు.
రెండు బులెట్‌లు ఛాతిలోకి దూసుకెళ్లాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మరణించారు. ఈ విషయమై ఐజీ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ... వ్యక్తిగత కక్షలతోనే హనుమంత లాడ పై దాడి జరిగిందని తెలిపారు. దుండగులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా, హనుమంతరాయపై హత్యాయత్నంతో పాటు వివిధ పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.