
తలలేని మొండెం తిరుగుతున్నట్టు...
వానియంబాడి సమీపంలో తలలేని మొండెంతో రక్తకాటేరి తిరుగుతున్నట్లు పుకార్లు లేవడంతో గ్రామస్తులు
వేలూరు: వానియంబాడి సమీపంలో తలలేని మొండెంతో రక్తకాటేరి తిరుగుతున్నట్లు పుకార్లు లేవడంతో గ్రామస్తులు భయాందోళనలతో అర్ధరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు చేసి సరిహద్దులో కాపలా కాశారు. స్థానిక బత్తాపేట గ్రామంలో సుమారు వెయ్యికి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో ఇంటి తలుపులు, కిటికీలు మూసి వేసి నిద్రించినా తలలేని మొండెంతో రక్తకాటేరి లోపలికి ప్రవేశించి ఉయ్యాల కట్టి ఊగుతోందని పుకార్లు షికార్లు చే స్తున్నాయి.
అదే విధంగా మూసిన తలుపులు ఎవరో తడుతున్నారని, బయటకు వచ్చి చూస్తే ఎవరూ కనిపించడం లేదని, ఇంటి బయట నీటిని చల్లుతున్నట్లు శబ్దాలు విసిపిస్తున్నాయని, బయటకు వచ్చి చూస్తే నీళ్లు చల్లి ఉండడం చూసి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వీటిపై గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామంలో తలలేని మొండెం తిరుగుతోందని, తమ గ్రామానికి వచ్చిన రక్తకాటేరిని తరిమి వేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో మంగళవారం రాత్రి గ్రామస్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆ సమయంలో గ్రామంలోని తొమ్మిది మంది మహిళలకు స్వామి వచ్చి గ్రామంలో రక్తకాటేరి ఉందని, దానివల్ల ఇది వరకే ఇద్దరు మృతి చెందారని, మరో ముగ్గురు మృతి చెందబోతున్నారని చెప్పారు. అనంతరం గ్రామస్తులు గ్రామ సరిహద్దులోని వంతెనపై రక్తకాటేరికి ప్రత్యేక పూజలు చేసి పంబ కొడుతూ గ్రామం చుట్టూ ఊరేగింపు చేశారు. ప్రతి ఇంటి ముందు మంచి నూనెతో దీపం వెలిగించి, జిల్లేడు కొమ్మలను ఉంచి కాపలా కాశారు.