
తమిళ రాజకీయాల్లో కీలక మలుపు!
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరిగాయి. అధికార అన్నాడీంఎకేలోని రెండు చీలిక వర్గాలు ఏకమయ్యే దిశగా కదులుతున్నాయి. ఓ పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ రోజు దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లాయడంతో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పన్నీర్ సెల్వం తన వర్గీయులతో సొంతగూటికి వచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓపీఎస్ వర్గాన్ని చేర్చుకునేందుకు సీఎం పళనిస్వామి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. శశికళ వర్గీయులపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఓపీఎస్ వర్గాన్ని తమలో విలీనం చేసుకునేందుకు అధికార వర్గం ముందుకు వచ్చినట్టు విశ్వనీయవర్గాల సమాచారం. రెండాకుల గుర్తు కోసం దినకరన్ రూ. 50 కోట్లు ఇవ్వచూపినట్టు ఆరోపణలు రావడంతో మరోసారి కలకలం రేగింది. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ప్రలోభాల పర్వంతో శశికళ వర్గం అప్రదిష్టపాలైంది. మరోవైపు బెంగళూరు జైలులో ఉన్న శశికళను ఈరోజు దినకరన్ ప్రత్యేకంగా కలవనున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.