న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా పెట్టుకున్న మధ్యస్త బెయిల్ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తన సోదరుడు ప్రతాప్ సింగ్ చౌతాలా గత శనివారం మృతి చెందాడని, అతడి అంత్యక్రియలకు తాను హాజరు కావాల్సి ఉందని, కాబట్టి ఆరు వారాల పాటు తనకు మధ్యస్త బెయిల్ ఇప్పించాలని చౌతాలా హైకోర్టును ఆశ్రయించాడు. కాగా, దీనిపై స్పందించాలని సీబీఐను కోర్టు ఆదేశించింది. మంగళవారం కోర్టు ఈ కేసును తిరిగి విచారించే సమయానికి చౌతాలా పిటిషన్‌లోని విషయాలపై తగిన విధంగా స్పందించాలని సీబీఐని జస్టిస్ కైలాస్ గంభీర్ ఆదేశించారు. కాగా, చౌతాలాకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. చౌతాలా తన సోదరుడి అంత్యక్రియలకు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సీబీఐ అనుమతినిచ్చింది. చౌతాలా ఇప్పటికే సాధారణ బెయిల్ కోసం మే 30వ తేదీన హైకోర్టును ఆశ్రయించారని, అయితే దానిపై జూలై 11వ తేదీలోగా సమాధానమివ్వాలని హైకోర్టు తమను కోరిందని కోర్టుకు సీబీఐ నివేదించింది.
చౌతాలా తరఫు న్యాయవాదులు హరిహరన్, అమిత్ సాహ్ని మాట్లాడుతూ .. కుటుంబ పెద్దగా తన సోదరుడి మృతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఓం ప్రకాశ్ చౌతాలా దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆరు వారాల మధ్యస్త బెయిల్ కోసం చౌతాలా దరఖాస్తు చేసుకున్నారని వాదించారు. అయితే అంత్యక్రియలకు సంబంధించి ఆరు వారాల పాటు చేసే కార్యక్రమాలు ఏముంటాయని జస్టిస్ గంభీర్ ప్రశ్నించారు. చౌతాలా కోరితే నాలుగు రోజులపాటు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించారు. కాగా, కర్మ చేపట్టే 13 రోజుల పాటు అంటే కనీసం జూన్ 14వ తేదీవరకైనా బెయిల్ ఇప్పించాలని హరిహరన్ కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
అంత్యక్రియలకు 6 వారాల బెయిల్ ఇవ్వలేం..
Published Mon, Jun 2 2014 9:59 PM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement
Advertisement