నగరంలో సోమవారం 66వ గణతంత్ర వేడుకలు భారీ బందోబస్తు మధ్య జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధాన అతిథి కావడంతోపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ
న్యూఢిల్లీ: నగరంలో సోమవారం 66వ గణతంత్ర వేడుకలు భారీ బందోబస్తు మధ్య జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధాన అతిథి కావడంతోపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి వీవీ ఐపీలు ఇందులో పాలుపంచుకోవడంతో అడుగడుగునా పోలీసు సిబ్బందిని మోహరించారు. వెయ్యిమంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు (ఎన్‌ఎస్‌జీ) సహా దాదాపు 45 వేల మంది నగర పోలీసులు వేడుకలు జరుగుతున్న పరిసరాల్లో భద్రతా విధులను నిర్వర్తించారు. ఇంకా వీరితోపాటు స్నిప్పర్లు, పారామిలిటరీ బలగాలు కూడా ఇందులో పాలుపంచుకున్నాయి. వేదిక పరిసరాలే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ భద్రతా సిబ్బంది నిఘా సాగింది.
రాజ్‌పథ్‌కు రెండు కిలోమీటర్ల పరిధిలోని అత్యంత ఎత్తయి న భవనాలపై ఎన్‌ఎస్‌జీ స్నిప్పర్లు అత్యాధునిక ఆయుధాలతో అప్రమత్తంగా వ్యవహరించారు. మధ్య, ఉత్తర, న్యూఢిల్లీ జిల్లాలలో మొత్తం 20 వేలమంది సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 15 వేల సీసీటీవీ కెమెరాలు దృశ్యాలను నమోదు చేశాయి. ప్రధాన వేదిక పరిసరాల్లో 18 మీటర్లకొకటి చొప్పున అత్యంత శక్తిమంతమైన 160 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వేదికకు 500 కిలోమీటర్ల పరిధిలో విమానాలు, హెలికాప్టర్లను అనుమతించలేదు. గతంలో నిషిద్ధ గగనతల పరిధి 300 కిలోమీటర్లే కావడం గమనార్హం. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్లను కూడా ఏర్పాటుచేశారు.
మెట్రో సేవలపై పాక్షిక ఆంక్షలు
భద్రతా చర్యల్లో భాగంగా నగరంలో సోమవారం మెట్రో రైలు సేవలపై పాక్షిక ఆంక్షలను విధించారు. సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్, మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలను ఉదయం ఆరు నుంచి రాత్రి 12 గంటలవరకూ మూసిఉంచారు. ఇక పటేల్‌చౌక్, రేస్ కోర్సు స్టేషన్ల ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలను కూడా ఉదయం 8.45 గంటలనుంచి రాత్రి 12 వరకూ మూసేశారు.