హైకోర్టు నోటీసులు | High Court notices on Cash gifts delivery Election Commission | Sakshi
Sakshi News home page

హైకోర్టు నోటీసులు

Published Tue, Oct 25 2016 2:39 AM | Last Updated on Fri, Aug 31 2018 8:57 PM

హైకోర్టు నోటీసులు - Sakshi

హైకోర్టు నోటీసులు

ఎన్నికల కమిషన్, అభ్యర్థులకు జారీ
వివాదాస్పద అభ్యర్థులపై 9లోగా వివరణ
పీఎంకే అభ్యర్థుల జాబితా వెల్లడి
బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు

గడిచిన ఎన్నికల్లో నగదు, బహుమతులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఎన్నికల రద్దుకుకార కులైన సెంథిల్ బాలాజీ (అన్నాడీఎంకే), కేసీ పళనిస్వామి (డీఎంకే) లను ఉప ఎన్నికల్లో అభ్యర్థులుగా అనుమతించడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, ఇద్దరు అభ్యర్థులకు మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. కరూరు జిల్లా అయ్యంపాళయంకు చెందిన ఎస్ రాజేంద్రన్ అనే వ్యక్తి ఇటీవల దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి నోటీసులు పంపింది. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఓటర్లకు నగదు బట్వాడాతో అక్కడి ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. దీంతో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 232 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ రెండు నియోజకవర్గాలకు వచ్చేనెల 19వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే తరఫున సెంథిల్ బాలాజీ, డీఎంకే తరఫున కేసీ పళనిస్వామి పోటీపడుతున్నారు.

వీరిద్దరూ గడిచిన ఎన్నికల్లో ఓటర్లకు నగదు, పంచెలు, చీరలు, బహుమతులు పంపిణీ చేసిన ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే  డీఎంకే అభ్యర్థి కుమారుడి ఇంటిపైనా, కరూరులోని అన్నాడీఎంకే అభ్యర్థి అనుచరుడు అన్బునాథన్ ఇంటిపైనా అదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక అభ్యర్థుల అనుచరుల ఇళ్లలో మద్యం బాటిళ్లు, చీరలు, పంచెలు పట్టుపడ్డాయి. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్న కారణంగానే అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దయ్యాయి.

ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఎన్నికల రద్దుకు కారకులైన అదే అభ్యర్థులను ఉప ఎన్నికల్లో మరలా పోటీకి పెట్టడం సరైన నిర్ణయం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్టే అవుతుంది. కాబట్టి వీరిద్దరిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. వారి నామినేషన్లను తిరస్కరించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని, ఒక వేళ వీరు పోటీ చేస్తే వీరిద్దరికీ పడిన ఓట్లను లెక్కించరాదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. ఎన్నికల పనులు ప్రారంభమైనందున న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని చట్టంలో పేర్కొని ఉన్నా ఇది ఎంతో ముఖ్యమైన కేసుగా పరిగణిస్తున్నామని వారు అన్నారు. అరవకురిచ్చిలో ఇప్పటికే 15 రోజులపాటూ ప్రభుత్వ ధనం, అభ్యర్థుల ధనం ఖర్చయిందని చెప్పారు. డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థుల నుంచి ఖర్చయిన సొమ్మును రాబట్టాలని పీఎంకే అభ్యర్థి భాస్కరన్ వేసిన పిటిషన్‌ను కూడా తాము విచారిస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. భాస్కరన్ వేసిన పిటిషన్ వచ్చే నెల 9వ తేదీ విచారణకు వస్తున్నందున ఈ పిటిషన్‌ను సైతం 9వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపారు.

పిటిషన్ దారులు చేసిన ఆరోపణలపై డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్నికల కమిషన్ సవివరమైన నివేదికను 9వ తేదీ దాఖలు చేయాలని ఆదేశిస్తూ సోమవారం నోటీసు జారీ చేశారు. హైకోర్టులో పిటిషన్‌లపై విచారణలు కొనసాగుతుండగా ఈ నెల 28న తంజావూరు, అరవకురిచ్చి డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. పీఎంకే నుంచి పోటీ చేయబోతున్న అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించారు. అరవకురిచ్చి నుంచి పీఎంకే భాస్కరన్, తంజావూరు నుంచి కుంజితపాదం, తిరుప్పరగుండ్రం నుంచి టీ సెల్వం ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు పీఎంకే ప్రధాన కార్యదర్శి జీకే మణి సోమవారం మీడియాకు తెలియజేశారు.

బీజేపీ అభ్యర్థులు ఖరారు: కేంద్ర మంత్రి పొన్
రాష్ట్రంలో అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరగుండ్రం నియోజకవర్గాల్లో వచ్చేనెల 19 తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ తెలిపారు. తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర శాఖ ముగ్గురి పేర్లను ఖరారు చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిందని, ఢిల్లీ నుంచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని ఆయన తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఓటర్లకు నగదు బట్వాడా, బహుమతుల పంపిణీ వంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement