సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ్యత్వం రద్దు కేసుకు సంబంధించి హైకోర్టులో ఎన్నికల సంఘం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి అని.. ఆరు వారాల వరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దన్న కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని ఈసీ తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంది. తమపై వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఎన్నికల సంఘం హైకోర్టును కోరింది.
కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం
మరోవైపు ఇదే కేసుకు సంబంధించి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున న్యాయ విభాగ కార్యదర్శి వి.నిరంజన్ రావు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయ, శాసన వ్యవహారాల శాఖకు ఎలాంటి సంబంధం లేదని కౌంటర్ లో పేర్కొన్నారు. పిటిషనర్లు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్ని కోరుకోవడం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పిటిషనర్లు అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయ, శాసనవ్యవహారాల శాఖను చేర్చారని.. హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో నిరంజన్ రావు పేర్కొన్నారు. ఈ పిటిషన్ హైకోర్టు సోమవారం విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment