హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించే ముందు చట్ట ప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ముందు బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఆ వివరాలను ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని స్పష్టం చేసింది. ఇవన్నీ పూర్తి చేశాకే ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇది చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, బి.రవీంద్రనాథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేల్చిన లెక్కల్లో బీసీ జనాభా ఎంతుందో ప్రకటించి, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్ బీసీ తరగతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్ రాజు సంయుక్తంగా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు మంగళవారం విచారణ జరిపారు.
బీసీ జనాభా ఎంతో ప్రభుత్వానికే స్పష్టత లేదు...
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనల ప్రకారం బీసీ జనాభాను లెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీ జనాభా లెక్కించాకే బీసీ ఓటర్లను గుర్తించి చట్ట ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు బీసీ జనాభా, ఓటర్లను లెక్కించలేదని, అయినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం చట్టవిరుద్ధమని వాదించారు. బీసీ జనాభా విషయంలో ప్రభుత్వానికే స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 34 శాతం అని ఓసారి, గతేడాది జారీ చేసిన బిల్లులో 37 శాతమని, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 54 శాతం అని రకరకాలుగా చెబుతోందన్నారు. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు బీసీ జనాభాను శాస్త్రీయంగా లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ జనాభా లెక్కలు తేలితే తప్ప ఏ,బీ,సీ,డీ,ఈ వర్గీకరణ సాధ్యం కాదన్నారు.
నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు...
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు వివరణ కోరారు. బీసీ జనాభా ఎంతో తేల్చకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనికి ఏఏజీ స్పందిస్తూ బీసీ జనాభా గణన జరిగిందని చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వద్ద బీసీ జనాభా లెక్కలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో పంచాయతీరాజ్ చట్టాన్ని పరిశీలించిన న్యాయమూర్తి... తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సర్వే నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అంతే తప్ప డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌కు బీసీ జనాభా లెక్కల గణనతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
దీనికి ఏఏజీ సమాధానమిస్తూ గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తానన్నారు. గడువిచ్చేందుకు అభ్యంతరం లేదని, ఈలోగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చునని ఏఏజీ చెప్పడంతో అలా అయితే చట్టం నిర్దేశించిన విధివిధానాలను పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment