తుది ఓటర్ల జాబితా ఏదీ..?  | Where is the final list of voters | Sakshi
Sakshi News home page

తుది ఓటర్ల జాబితా ఏదీ..? 

Published Tue, Jan 8 2019 1:52 AM | Last Updated on Tue, Jan 8 2019 1:52 AM

Where is the final list of voters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీల్లో తుది ఓటర్ల జాబితా ప్రకటించకుండానే ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారులు సోమవారం నోటిసులు జారీ చేశారు. గతేడాది మే 17న గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను విడుదల చేయగా ఆ తర్వాత డిసెంబర్‌ 19న తొలి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఈ నెల 1న రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి ఈ నెల 7న రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. అయితే రెండో అనుబంధ ఓటర్ల జాబితాను విడుదల చేయకుండానే చాలా చోట్ల తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సోమవారం రిటర్నింగ్‌ అధికారులు నోటిసులు జారీ చేయడంపై చాలా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం స్పందించింది. రెండో అనుబంధ ఓటర్ల జాబితాను తక్షణమే ప్రకటించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. అశోక్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటిస్తేనే పంచాయతీ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితా సిద్ధం కానుంది. రెండో అనుబంధ ఓటర్ల జాబితాలు విడుదల చేసినట్లు రుజువుగా పీడీఎఫ్‌ కాపీలను సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

భారీగా ఓట్ల గల్లంతు..! 
అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 22 లక్షల ఓట్లు గల్లంతు కావడంపై వివాదం సద్దుమణగకముందే తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ భారీగా ఓట్లు గల్లంతు అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం, అందులో పేరుంటేనే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అర్హులనే నిబంధన ఉండటంతో నామినేషన్‌ వేయలేకపోతున్నట్లు ఔత్సాహిక అభ్యర్థులు వాపోతున్నారు. అడ్డగోలుగా తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పెద్ద సంఖ్యలో బాధితులు జిల్లా కలెక్టర్లు, మండల తహసీల్దార్లకు మొరపెట్టుకుంటున్నారు. మరికొందరు సోమవారం హైదరాబాద్‌ వచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. 

క్షేత్రస్థాయిలో వైఫల్యం వల్లే... : ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీలు, వార్డులవారీగా విభజించి పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించుకుంటున్నారు. డిసెంబర్‌ 19న ప్రచురించిన పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తొలి అనుబంధం ప్రకారం రాష్ట్రంలో 1.37 కోట్ల మంది ఓటర్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపణలు వచ్చినా అదే ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని పంచాయతీ ఎన్నికలకు వెళ్లడంతో మళ్లీ అదే సమస్య పునరావృతం అయ్యేందుకు అవకాశం కల్పించినట్లు అయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కావాలని ఓట్లు గల్లంతు చేశారు... 
మా గ్రామం జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో సర్పంచ్‌గా పోటీ చేయాలని నా భార్య వనజ భావించింది.  ఓటర్ల జాబితాలో మా కుటుంబ సభ్యుల పేర్లు లేవని తెలిసి కంగుతిన్నాం. ఓటర్ల జాబితాలో మా కుటుంబ పేర్లను చేర్చేలా సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని సోమవా రం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం సమర్పించా. ఓటరు జాబితాలో మా పేర్లు చేర్చకుంటే హైకోర్టుకెళ్తాం. 
–రంగన్నగారి మధుసూదన్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం తిరుమలపూర్‌ 

దరఖాస్తు చేసుకున్నా ఓటు రాలేదు... 
మా తండాకు గ్రామ పంచాయతీ హోదా రావడం, ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో ఎన్నికల్లో నా సోదరుడి భార్య ఎ. విజయను పోటీలోకి దింపాలనుకున్నాం. సోమవారం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చకపోవడంతో ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించా. గత నెల 29న ఓటరుగా నమోదు కోసం విజయ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఇంకా ఓటు రాలేదు. 
   –గోపాల్‌నాయక్, వనపర్తి జిల్లా బొమరాస్‌పేట మండలం మదంపల్లితండా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement