
ఒక్కసారే ప్రేమలో పడ్డా!
జీవితంలో ఒక్కసారే ప్రేమలో పడ్డానంటున్నారు సంచలన నటి త్రిష. ఈమె ఎప్పుడెలా మాట్లాడుతారా? ఎలా స్పందిస్తారో? తెలియదు. అయితే త్రిష ఏం మాట్లాడినా అది సంచలనమే. ఏమి చేసినా కలకలమే. నిజమెంత అన్నది పక్కన పెడితే ఆమెపై ప్రచారం అయిన వదంతులు చాలానే. ఒక్క విషయం మాత్రం జగమెరిగిన నిజం. అదే నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థం, పెళ్లి వరకు వచ్చి నిలిచిపోవడం, ఈ విషయం గురించి ప్రస్తావించవద్దు ...ఎందుకంటే ఆ మేరకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాం అంటున్న త్రిష మాట్లాడుతూ జయంరవి సరసన తాను నటించిన సకలకళా వల్లవన్ చిత్రం శుక్రవారం విడుదలై మంచి ప్రజాదరణతో ప్రదర్శింపబడడం సంతోషంగా ఉందన్నారు.
ప్రస్తుతం కమలహాసన్ సరసన తూంగావనం, సుందర్ సి దర్శకత్వంలో అరణ్మణై -2 చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. తూంగావనం చిత్రంలో వైవిధ్యభరిత పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. సినిమా రంగంలో పలువురు స్నేహితురాళ్లు ఉన్నా నటి నయనతార మాత్రమే అత్యంత సన్నిహితురాలు అని అన్నారు. ఆమెతో కలసి ఒక్క చిత్రంలో అయినా నటించాలని కోరుకుంటున్నానన్నారు. ఇక ప్రేమ, పెళ్లి విషయాలకొస్తే జీవితంలో ఒక్కసారే ప్రేమ పుట్టిందని ఆ తరువాత అది ఎలా మరుగున పడిందో తెలియలేదన్నారు. వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థం పెళ్లి, నిలిచిపోవడం గురించి ఏమి మాట్లాడకూడదని ఇరు కుటుం బాల వారు నిర్ణయించుకున్నామన్నారు. స్త్రీలకు పెళ్లి అవసరమే, నాకు తగిన వ్యక్తి లభిస్తే పెళ్లి గురించి ఆలోచిస్తా.