కత్తి కట్టిన కో‘ఢీ’
వందల కోట్లు చేతులు మారిన వైనం
సాక్షి నెట్‌వర్క్: అధికార పార్టీ అండ, పోలీసుల ఉత్తుత్తి ఆంక్షలతో కోర్టు నిషేధం నీరుగారి పోయింది. సంక్రాంతి సంప్రదాయం పేరిట పందెంరాయుళ్లు పేట్రేగి పోయారు. కోడి జూలు విదిల్చింది. కత్తి కట్టి మరీ కాలు దువ్వింది. చాలాచోట్ల అధికార పార్టీ నేతలే పందాలకు నేతృత్వం వహించి ప్రారంభించారు. బరుల వద్ద వెలసిన శిబిరాల్లో జూదం జోరుగా సాగింది. మద్యం ఏరులై పారింది. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నగదు చేతులు మారింది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే భోగి నుంచి మొదలుకుని మూడురోజుల్లో రూ.200 కోట్ల మేర పందేలు జరిగినట్లు అంచనా. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో ఆదివారం రాత్రి కూడా కోడిపందేలు కొనసాగాయి.
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఈ నెల 13 నుంచి 25 వ తేదీ వరకు జిల్లాలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. ఈ హెచ్చరికలేవీ పందేలకు వందలాదిగా తరలివచ్చినవారిని ఆపలేకపోయాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పందేలకు అనుమతి ఇవ్వక పోవడంతో అక్కడి నుంచి జూదరులు జిల్లాకు భారీగా తరలివచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఏడాది కోడి పందేలు నిర్వహించడం గమనార్హం. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కోడిపందేల్లో పాల్గొంటే.. ఆయన తమ్ముడు, ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో కోడి పందేలను ప్రారంభించారు.
ఉత్సాహంగా జల్లికట్టు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో పశువుల పండుగ (జల్లికట్టు)ను అత్యంత వైభవంగా నిర్వహించారు. జల్లికట్టులో దూసుకువస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకులు పోటీపడ్డారు.