
ఇక నేను రెడీ
ఇక నేను రెడీ! మీరు రెడీయా! అంటున్నారు నటి లక్ష్మీమీనన్. చదువు కోసం సినిమాను కొంచెం దూరంగా పెట్టిన ఈ కేరళ కుట్టి ప్లస్-2 పరీక్షలు రాసేశారు. ఆ సమయంలో నటనకు ఫుల్‌స్టాప్, బెంగళూరులో మకాం అంటూ ఉన్నవి లేనివీ చాలానే రాసేశారు. ఇప్పుడు పరీక్షల సమయం అయిపోయింది. ఇక నటించడానికి నేను రెడీ? అవకాశాలు ఇవ్వడానికి మీరు రెడీనా? అంటూ ఛాలెంజ్ చేసే ధోరణిలో అంటున్నారు నటి లక్ష్మీమీనన్.
పరీక్షల్లో మునిగిపోయి తాను నటించిన తాజా చిత్రం కొంబన్ కూడా చూడని ఈ నటి ఆ చిత్రం విడుదలై ప్రజాదరణ కూడా పొందడంతో ఇటీవల చిత్ర సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న లక్ష్మీమీనన్ మంచి జోష్‌లో కనిపించారు. తొలి చిత్రం కుంకి నుంచి కొంభన్ వరకు వరుస విజయాలును తన ఖాతాలో వేసుకుంటున్న ఈ లక్కీ బ్యూటీ ఈ మధ్య చదువుపై పూర్తి ఏకాగ్రత సారిస్తూ అవకాశాలను కూడా తిరస్కరించారు.
ప్రస్తుతం మీరెలాంటి కథ చెప్పినా నా బుర్రకెక్కదు అంటూ దర్శక నిర్మాతలకు సున్నితంగానే నచ్చచెబుతూ వచ్చిన లక్ష్మీమీనన్ తాజాగా మీరు చెప్పే కథలు వినడానికి నేను రెడీ, కథలు వినిపించడానికి మీరు రెడీయా అంటూ అంటున్నారు లక్ష్మీమీనన్. కొంభన్ విజయంతో మళ్లీ ఆమెను ఎంపిక చేసుకోవడానికి పోటీ పడుతున్నట్లు సమాచారం.