పారిపోను.. మడమ తిప్పను: పవన్
అనంతపురం: సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే తప్ప పారిపోయే వ్యక్తిని కాదని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎందాకైనా పోరాడతానని, మడమ తిప్పబోనని చెప్పారు. గురువారం సాయంత్రం అనంతపురంలో ప్రత్యేక హోదాపై నిర్వహించిన
సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ మాట్లాడారు. అంతకంటే ముందు వీర జవానులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కాకినాడ సభ తర్వాత అనంతపురం రెండు వారాల కిందటే రావాల్సి ఉందని, సరిహద్దులో భారత జవాన్లు వీర మరణం పొందిన సమయంలో ప్రత్యేక హోదాపై మాట్లాడటం సరికాదని అనిపించిందని అందుకే ఆలస్యంగా సభ పెట్టాల్సి వచ్చిందని అన్నారు.
అనంతపురం అంటే తనకిష్టం అని, కరువు కోరలో చిక్కుకుపోయిన జిల్లా అనంతపురానికి అండగా ఉండటం తనకు చాలా ఇష్టమని అన్నారు. తానేం కేంబ్రిడ్జిలోచదివిన వాడిని కాదు.. సగటు మార్కులతో ఎస్సెస్సీ పాసయిన వాడినని, అందుకే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ప్రకటనపై చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశానని పవన్ తెలిపారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు సరళ భాషలో మాట్లాడతారని.. ఏదైనా ఇవ్వాల్సి వస్తే మాత్రం కఠిన భాషలో మాట్లాడతారని ఆ భాష చూస్తే పారిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే కేంద్రం విడుదల చేసిన ఆ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనను అన్ని రకాల నిపుణుల ద్వారా అధ్యయనం చేయించి పూర్తి వివరాలు తెలుసుకున్నానని, మనకు ఇవ్వాల్సిందే ఇచ్చారు తప్ప కొత్తగా ఇచ్చిందేమి లేదని చివరకు తేలిందని చెప్పారు. పోయినసారి ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలని అన్నానని, అగౌరవపరచడం నా ఉద్దేశం కాదన్నారు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని, మంత్రులు పెప్పర్ స్ప్రేలు కొట్టారని అన్నారు.