'ప్యాకేజీ చదివి చదవి నాకు సైట్ వచ్చింది'
అనంతపురం: కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో కొత్తగా ఇచ్చినవి ఏవీ లేవని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవ్వని హోదాకు కొంతమంది హీరోలు కూడా అయ్యారని ఆయన విమర్శించారు. గురువారం సాయంత్రం అనంతపురంలో నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ప్రకటన చదివి చదివి తనకు సైట్ కూడా వచ్చిందని చెప్పారు. పేపర్లో ఈ విషయాలు చెప్పడానికి కేంద్రం రెండున్నరేళ్లు తీసుకుందని మండిపడ్డారు. పేపర్లపై ప్రకటనలకే అంత సమయం పడితే సీమాంధ్ర పరిశ్రమల స్థాపనకు ఎంత సమయం పట్టాలని ప్రశ్నించారు.
అనంతపురంలో పరిశ్రమలు రావాలంటే ముందు నీళ్లుండాలని, నీళ్లు లేని ఈ జిల్లాలో పరిశ్రమలు ఎలా పెడతారో చెప్పాలని, యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తారో వివరించాలని నిలదీశారు. కడపలో స్టీల్ పరిశ్రమ, ఆయిల్ రిఫైనరీలు పెట్టే ఆలోచన ఉందని పేపర్లో ప్రకటించి పక్క రాష్ట్రాల్లో మాత్రం ఏకంగా వాటిని ఏర్పాటుచేసే చర్యలు మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమను మోసం చేయడం మానుకోవాలని కేంద్రానికి, బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుక ఆ పనిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.