కామెడీ కావాలి గురూ!
నటి నయనతార మైండ్ సెట్ మారిందా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. శింబు, ప్రభుదేవాలతో ప్రేమ బెడిసికొట్టిన తరువాత నయనతారలో చాలా మార్పు వచ్చింది. అంతకు ముందు సెట్‌లో గలగలా నవ్వుతూ సందడి చేసే ఈ మలయాళీ బ్యూటీని ప్రేమ వ్యవహారం చాలా బాధించిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఆమె మూడీగా మారిపోయారు. కెమెరా ముందు మినహా ఇతర సమయాల్లో ఒక మూల ఏకాంతంగా కూర్చుంటారని యూనిట్ వర్గాలు అంటుంటారు.
ఏవరైనా జోక్స్‌తో సందడి చేసినా మొహమాటానికి చిన్న నవ్వుతో సరిపెట్టుకునేవారట. నయనతార ఈ తరహా ప్రవర్తనతో దర్శక నిర్మాతలు కూడా ఆమెకు సీరియస్ కథా పాత్రలే ఇస్తున్నారు. అలా సెకెండ్ ఇన్నింగ్స్‌లో నయనతార ఎక్కువగా సీరియస్ పాత్రలే పోషించారని చెప్పవచ్చు.రాజారాణి, అనామిక, నన్బేండా, మాస్ చిత్రాలే ఇందుకు ఉదాహరణ.నానూమ్ రౌడీదాన్, కాష్మోరా,తిరునాళ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రేమ,పాటలు అంటూ షరా మామూలు పాత్రలు పోషించిన నయనతారకు నానూమ్ రౌడీదాన్, తిరునాళ్ చిత్రాల్లో కాస్త హాస్యం రంగరించిన పాత్రలు లభించాయట.
ఆపాటి హాస్యానికే ఖుషీ అయిన నయన్‌కు ఇప్పుడు పూర్తి వినోదభరిత పాత్రల్లో నటించాలనే ఆశ కలుగుతోందట.దీంతో తన వద్దకు వచ్చే దర్శకనిర్మాతలకు పూర్తి హాస్యభరిత పాత్రలతో రండి గురూ అంటూ విన్నవించుకుంటున్నారట. రియల్ లైఫ్‌లో కొరవడిన వినోదాన్ని రీల్ లైఫ్‌లో నయినా పొందాలనుకుంటున్నారేమో నయన్ అనే కామెంట్ కోడంబాక్కంలో వినిపిస్తోంది. సో నయనతారతో చిత్రాలు చెయ్యాలనుకునే దర్శక నిర్మాతలు వినోదభరిత పాత్రలు కావాలంటున్న ఆమె నయా కోరికను పరిశీలించాలి.