
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కావడంతో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం జనతాదళ్ సెక్యులర్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరో ఫార్ములా తెరపైకి తెచ్చారు. కొత్తగా 30–30 ఫార్ములా తీసుకువస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలకు ముందు ఒక నిర్ణయం.. ఫలితాలు వచ్చాక మరో ఆలోచన.. అధికారం చేపట్టాక ఇంకో మలుపు తెచ్చింది. జేడీఎస్ 30 నెలల అనంతరం సీఎం పదవిని కాంగ్రెస్ కోరినట్టు తెలుస్తోంది. దీంతో జేడీఎస్ నాయకులు కలవరపాటుకు గురవుతున్నారు.
రెట్టింపు సీట్లు వచ్చినప్పటికీ..
జేడీఎస్ (37) కన్నా కాంగ్రెస్ (79) రెట్టింపు సీట్లు వచ్చినప్పటికీ.. ఎన్నికల తర్వాత నెలకొన్న అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు అండగా నిలిచి.. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా మారింది. అయితే జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ విషయంలో సీఎం పదవి కీలకం కానుంది. ముందుగా కుదిర్చిన ఒప్పందం ప్రకారం ఐదేళ్ల పాటు కుమారస్వామి కొనసాగుతారా? లేదా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుమారస్వామి ఐదేళ్లు పదవిలో ఉండటం తమకు మింగుడు పడటం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు అదిష్టానం వద్ద మొర పెట్టుకుంటున్నట్టు సమాచారం.
ఐదేళ్లు సరికాదు : ఖర్గే
అయితే తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌కు ఐదేళ్ల పాటు సీఎం పదవి కట్టబెట్టడం సరికాదని లోక్‌సభ ప్రతిపక్షనేత మలికార్జునఖర్గే ఆవేదన చెందినట్లు తెలిసింది. ఈమేరకు ఆయన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మరోసారి చర్చించి నిర్ణయిస్తే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మంత్రిమండలి తీర్మానాల్లో భాగంగా ప్రధానమైన శాఖలన్నీ జేడీఎస్‌కే కేటాయించారని ఖర్గే మండిపడ్డారు. ఆ శాఖలతో జేడీఎస్ ఐదేళ్ల పాటు పాలిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం.
బీజేపీ అధికారంలోకి రాకూడదనే..
ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది. హంగ్ రావడంతో బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అధికారంలోకి వస్తుందని భావించిన కాంగ్రెస్ సీఎం పదవిని జేడీఎస్‌కు కట్టబెడుతూ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐదేళ్ల పాటు సీఎం పదవిలో కుమారస్వామి ఉంటారని కూడా కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రకటించారు. అయితే బీజేపీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే జేడీఎస్‌తో కలిశామని.. ఐదేళ్ల పాటు జేడీఎస్‌కు సీఎం పదవి ఇవ్వడంపై చాలామంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తలా 30 నెలలు పాలించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలుస్తోంది.
కాలమే సమాధానం చెబుతుంది
పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో కొనసాగుతున్న కర్ణాటక రాజకీయంలో కాంగ్రెస్ –జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ఎన్ని రోజులు నిలుస్తుందనే దానిపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మూడు నెలలకే కుప్పకూలుందని ప్రతిపక్షనేత బీఎస్ యడ్డూరప్ప వ్యాఖ్యానించారు. కాగా చెరో 30 నెలలు పాలించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డీకే శివకుమార్ దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటారా? మారుతారా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
కుమారస్వామే మా సీఎం
‘జేడీఎస్ అధినేత కుమారస్వామే మా సీఎం. ఆయనే ఐదేళ్ల పాటు పదవిలో ఉండవచ్చు. మా పూర్తి మద్దతు జేడీఎస్‌కే. ప్రభుత్వం ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం’ అని మే 15న కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య, డాక్టర్ పరమేశ్వర్ బహిరంగంగా ప్రకటించారు.
సీఎం సీటు పంచుకోం
‘కాంగ్రెస్–జేడీఎస్ కూటమిలో భాగంగా ఏర్పడే ప్రభుత్వంలో సీఎం సీటు పంచుకోం. ఐదేళ్ల పాటు నేనే సీఎంగా కొనసాగుతా. కాంగ్రెస్ నాకు పూర్తి మద్దతు ఇచ్చింది’ అని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment