బోగస్ ఓటర్లపై ఈసీ కన్ను
Published Mon, Oct 21 2013 2:02 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఢిల్లీ ఎన్నికల కమిషన్ (డీఈసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా బోగస్ ఓటర్ల ఏరివేతపై దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల్లో ఒక్క బోగస్ ఓటూ పడకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకుల నియోజకవర్గాల్లోనూ బోగస్ ఓటర్లను తీసివేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ బృందంలో ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు పనిచేస్తున్నారు. ఓటర్ లిస్ట్‌లో ఇచ్చిన అడ్రస్‌లో లేని వారి వివరాలు, బోగస్ ఓటర్లను గుర్తించే పనిలో ఈ బృందాలు నిమగ్నమయ్యాయని డీఈసీ అధికారి ఒకరు తెలి పారు. ఎన్నికల ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోందన్నారు. ఇందులో భాగంగానే ఒక్క బోగస్ ఓటూ పడకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు.
ఈసారి డిసెంబర్ నాలుగున జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బోగస్ ఓటర్లు పొలింగ్ బూత్‌ల వరకు రాకుండా నిఘా వేసిందని తెలిపారు. గతేడాది ఇంటి ఇంటికీ నిర్వహించిన సర్వేలో 15 లక్షల మంది ఉనికిలో లేని ఓటర్లను గుర్తించిందన్నారు. వీరిలో కొందరు చనిపోయినవారు ఉండగా, మరి కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఉన్నట్లుగా గుర్తించామని వివరించారు. గత నెల నుంచి ఓటర్ కార్డు కోసం రెండు లక్షలకు మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50,000 మంది దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేశారని తెలిపారు. ఓటర్ జాబితాలో పేర్లు నమోదుచేసుకునే వారి రద్దీని దృష్టిలో ఉంచుకొని నవంబర్ ఆరు వరకు కొత్త దరఖాస్తు ఫారాలను తీసుకోవాలని నిర్ణయిం చామని వివరించారు. పూర్తి చేసి ఇచ్చిన దరఖాస్తు ఫారాల వివరాలన్నింటినీ నిశితంగా పరిశీలించాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు.
అధికారుల కథనం ప్రకారం...ఢిల్లీలో 1.15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు వెయ్యి మంది ఉండగా, స్త్రీలు 804 మంది ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకున్నారు. గతేడాది నిర్వహించిన సర్వే వివరాల్లో కర్వాల్ నియోజకవర్గంలో 56వేల మంది, మటాయాలలో 46వేల మంది, ఉత్తమ్ నగర్‌లో 41వేల మంది ఉనికి లేని ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో 34వేలు, గాంధీనగర్‌లో 17వేలు, బల్లిమరన్‌లో 22వేలు, మంగోల్‌పురిలో 22వేలు, లక్ష్మీనగర్‌లో 23వేలు, గ్రేటర్ కైలాశ్‌లోనూ 31వేలు మంది ఉన్నట్టుగా తేలింది. ఈ సర్వే అనంతరం 15 లక్షల మంది ఉనికి లేని ఓటర్లకు నోటీసులు జారీ చేశామని, నివాస ధ్రువీకరణపత్రాన్ని సమర్పించాలని కోరామని డీఈసీ అధికారి ఒకరు తెలిపారు. దీంతో 1.99 లక్షల మంది రెసీడెన్సీ అడ్రస్‌లను సమర్పించారని చెప్పారు. అయితే నోటీసులకు స్పందించని 13.1 లక్షల మంది ఓటర్లను జాబితాను నుంచి తొలగించామని వెల్లడించారు.
ఓటర్ జాబితాలోకి 7,000 మంది నిరాశ్రయులు
ఎన్నికల కమిషన్ ప్రారంభించిన ఓటర్ల నమోదు ప్రక్రియకు మంచి స్పందన వస్తోంది. అణగారిన వర్గాల ప్రజలు కూడా ఓటర్ల జాబితాలో చేరిపోయారు. సుమారు 7,000 మందికిపైగా ఇళ్లు లేని వారికి ఓటర్ కార్డులను ఈసీ జారీ చేసింది. గతేడాది 62 మంది ఉన్న వీరి సంఖ్య ఈసారి 7,000కు పైగా చేరిందని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ తెలిపారు. వీరిని ఓటర్ల జాబితాలో చేర్చడంతోనే తమ పని అయిపోలేదని, పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వినియోగించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మేం తొలినాళ్లలో అణగారిన వర్గాల ప్రజల కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినప్పుడు కేవలం 62 మంది ఓటర్లుగా ఉన్నారు. అయితే స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకోవడంతో 7,000 కి పైగా మందిని ఓటర్ల జాబితాలో చేర్పించగలిగామని చెప్పారు.
రానున్న రోజుల్లో కూడా ఈ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. ఈసారి వీరంతా ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో 25,000 మందికి పైగా ఇళ్లు లేని ప్రజలు ఉన్నారు. వీరిని ఓటరు జాబితాలో చేర్పించేందుకు ఫీల్డ్ సర్వేలు కూడా చేపట్టామని వివరించారు. నిర్వాసితుల గురించి పనిచేస్తున్న మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ సహకారం తీసుకుంటున్నామని వివరించారు. ఇళ్లు లేని వ్యక్తి నివసించే ప్రాంతానికి వెళ్లి బూత్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తాడని తెలిపారు. అతను అక్కడ కనిపిస్తే అదే అడ్రస్ మీద ఓటర్ కార్డును జారీ చేస్తున్నామన్నా రు.
ఇప్పటివరకు 550 మందికి పైగా లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు ఓటు హక్కు కల్పించామని చెప్పారు. ఇలాంటివారు తమ ఓటుహక్కును నమోదుచేసుకునేందుకు సిద్ధంగా ఉంటే ఆ ప్రాంతానికి వెళ్లి శిబిరాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుల సహకారం తీసుకొనున్నామని ఆయన వెల్లడించారు. ఇందు కోసం భారీ స్థాయిలో బలగాలను దింపేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించాయని చెప్పారు. సమస్యాత్మక ప్రాం తాల్లో భారీ భద్రత ఉంటుందన్నారు.
Advertisement
Advertisement