ముద్దు రచ్చ
ఐఐటీ విద్యార్థుల ముద్దు బాగోతం రచ్చకెక్కింది. ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇది ఏకంగా కోర్టుకు చేరింది. వ్యభిచార నేరం కింద కేసు నమోదుకు పిటిషనర్ పట్టుబట్టడంతో సైదాపేట కోర్టు విచారణకు శ్రీకారం చుట్టింది.
సాక్షి, చెన్నై: దేశంలో యువతీ యువకుల మధ్య ‘కిస్ ఆఫ్ లవ్’ పోటీలు పెద్ద చర్చకే దారి తీశారుు. ఉత్తరాదిలో ఇది చాపకింద నీరులా సాగినా, దక్షిణ భారతంలోని కేరళలో సాగిన ఈ పోటీ లు వివాదాన్ని సృష్టించాయి. సంప్రదాయాన్ని మంట గలుపుతూ కేరళ యువతీ, యువకు లు కొందరు వ్యవహరించిన తీరు ఆ రాష్ట్రంలో కలకలాన్ని రేపింది. దీంతో కిస్ ఆఫ్ లవ్ అంటూ ముద్దుల్లో మునిగిన యువతీ యువకులపై కేసుల మోత మోగింది. అదే సమయంలో చెన్నై ఐఐటీ విద్యార్థుల రూపంలో కిస్ ఆఫ్ లవ్ తమిళనాడులోకి ప్రవేశించింది. గత వారం ఐఐటీ ఆవరణలో వంద జంటలు కౌగిలింతలతో ముద్దుల్లో మునిగితేలాయి. తొలుత ఓ హాల్లో రహస్యంగా ఏర్పాట్లు చేసుకుని, మీడియా కంట పడకుండా ముద్దుల్లో మునిగారు. చివరకు మీడియాకు సమాచారం అందడంతో తమకేమి భయం అన్నట్టుగా ఈ జంటల్లో కొందరు చివరకు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
వివాదం : ఈ ముద్దుల వ్యవహారం పత్రికల్లో, టీవీల్లో రావడంతో వివాదం రేపింది. సంస్కృతి, సంపద్రాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలంగా ఉన్న తమిళనాడులో బహిరంగంగా ఐఐటీ యువతీ, యువకులు సాగించిన ముద్దుల తీరు రచ్చకెక్కింది. ఐఐటీ యాజమాన్యంపై, విద్యార్థులపై చర్యకు పట్టుబడుతూ ఆందోళనలు బయలుదేరాయి. ఓ వైపు పీఎంకే, మరో వైపు హిందూ మున్నని నేతృత్వంలో ఆందోళనలు సాగుతున్నాయి. పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. విచారణ పేరిట పోలీసులు ఆ ఫిర్యాదులపై ఇంత వరకు స్పందించ లేదు. సంస్కృతి సంప్రదాయాల్ని మంట గలిపే విధంగా ఐఐటీలో సాగిన ఈ వ్యవహారం, ఇతర కళాశాలలకు పాకకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.
పిటిషన్ దాఖలు: ఓవైపు ఆందోళనలు సాగుతుంటే, మరో వైపు వ్యవహారం కోర్టుకు చేరింది.
ఐఐటీలో కొందరు విద్యార్థులు వ్యవహరించిన తీరును దుయ్యబడుతూ సామాజిక సేవకుడు వారాహి గురువారం సైదాపేట తొమ్మిదో మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని తన పిటిషన్‌లో వివరించారు. తమిళనాడులో సంస్కృతి, సంప్రదాయం, భాషా పరంగా అనుసరిస్తున్న విధానాలు గుర్తు చేశారు. అయితే, ఐఐటీ విద్యార్థుల రూపంలో తమిళనాడులోని ఇతర విద్యార్థులకు పెద్ద కలంకం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఐటీలో కొందరు విద్యార్థులు వ్యవహరించిన అనాగరిక చర్యతో తమిళనాడులోని విద్యార్థినీ విద్యార్థుల గౌరవానికి భంగం కల్గిందని పేర్కొన్నారు. పత్రికల్లో, టీవీల్లో ఆ విద్యార్థుల వ్యవహారం అసభ్యకరంగా ఉందని, మరీ శ్రుతి మించి వారు వ్యవహరించిన తీరు తమిళ సంస్కృతికి మచ్చను చేకూర్చేలా ఉందన్నారు. సంప్రదాయాల్ని మంట కలిపే విధంగా విద్యార్థులు వ్యవహరిస్తుంటే, ఐఐటీ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కిస్ ఆఫ్ లవ్ పేరిట ఒకే చోట అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమికూడి అసభ్యకరంగా వ్యవహరిస్తే, అడ్డుకోవాల్సిన ఐఐటీ వర్గాలు చోద్యం చూశాయని ఆరోపించారు.
విచారణకు : కేరళలో విద్యార్థులు వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసిందని తన పిటిషన్‌లో వారాహి గుర్తు చేశారు. అయితే, ఇక్కడ తమిళ సంస్కృతిని మంట కలిపే విధంగా వ్యవహరించిన ఐఐటీలోని కొందరు విద్యార్థులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదులు చేరాయని, కొన్ని సంఘాలు ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఐఐటీలో అసభ్యకరంగా బహిరంగంగా ముద్దుల్లో మునిగి తేలిన విద్యార్థులపై, ఐఐటీ డెరైక్టర్‌పై వ్యభిచార నేరం, భారత శిక్షాస్మృతి చట్టాల కింద కేసు నమోదు చేయాలని, ఇందుకు తగ్గ ఆదేశాలను పోలీసులకు జారీ చేయాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి శాంతి విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరపున న్యాయవాది కృష్ణమూర్తి హాజరైన వాదన విన్పించారు. తదుపరి విచారణను డిసెంబరు ఒకటో తేదీకి న్యాయమూర్తి శాంతి వాయిదా వేశారు.