సంతానం నివాసముంటున్న ఫ్లాట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాలు విడుదలవడం సంప్రదాయం. అయితే తమిళనాడులో దీపావళి సమయంలో పెద్ద చిత్రాలు విడుదలవుతుంటాయి. ఈ దీపావళికీ భారీ చిత్రాలు ముస్తాబయ్యాయి. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన అళగురాజా, ఎ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరించిన ఆరంభం, మరికొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. తమిళ ప్రజలను తన హాస్యంతో ఉర్రూతలూగించి పారితోషికంలో రికార్డు సృష్టించిన వడివేలుకు రాజకీయ గ్రహణం పట్టడంతో తెరమరుగయ్యారు. ప్రస్తుతం సంతానం హవా నడుస్తోందని చెప్పవచ్చు. సంతానం రోజుకు రూ.10 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో 15 చిత్రాలతో సంతానం డైరీ ఫుల్ అని చెబుతున్నారు. ఆర్.బి.చౌదరి ప్రస్తుతం ‘జిల్లా’ అనే సినిమాను నిర్మిస్తూ పొంగల్‌కు విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అళగురాజా నిర్మించిన జ్ఞానవేల్‌రాజా, ఇదే చిత్రంలో హాస్యపాత్ర పోషించిన సంతానం ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. చెన్నై తణికాచలం రోడ్డులోని జ్ఞానవేల్‌రాజా, సాలిగ్రామంలోని సంతానం ఇళ్లపై దాడులు జరిపారు. సేలం కొత్త బస్టాండ్ సమీపంలోని సినిమా నగర్‌లోని జ్ఞానవేల్‌రాజా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం లో సోదాలు నిర్వహించారు. అలాగే నిర్మాత అశోక్‌సామ్రాజ్ ఇంటిపై, కస్తూరి ఫిలిమ్స్ పేరుతో నిర్వహిస్తున్న డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంపై దాడులు జరిగాయి. చెన్నై టి.నగర్‌లోని సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి ఇంటిపై, సాలిగ్రామంలోని సూర్య ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత ఎ.ఎం.రత్నం ఇల్లు, కార్యాలయంపై దాడులు నిర్వహించారు.
ఎ.ఎం.రత్నానికి చెందిన మరో ఇల్లు హైదరాబాద్‌లో ఉండగా అక్కడా ఇదే సమయంలో ఐటీ దాడులు నిర్వహించారు. కోయంబత్తూరు సింగానల్లూరులోని కోవైతండి, ఎస్‌బీ కాలనీ రామ్‌నగర్‌లోని కేటీవీఆర్ రామస్వామి, వీరకేరళంలో స్టూడియో గ్రీన్, సేలం మాదంపట్టిలోని శివకుమార్, తిరిడా ముత్తూరులోని మరుదు సెల్వం, పీఎస్‌జీ కల్వారీ సమీపంలోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులుకోవై మురుగన్ తదితర సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరిపారు. ‘తలైవా’ చిత్ర నిర్మాత సుందరప్రకాష్ జైన్, దర్శకులు లింగుస్వామి ఇళ్లపైనా దాడులు జరిపారు.
30 చోట్ల దాడులు
చెన్నైలో 23 చోట్ల, ఇతర జిల్లాల్లో 6 చోట్ల, హైదరాబాద్‌లో చోట దాడులు జరిగాయి. సుమారు వంద మంది అధికారులు ఏకకాలంలో రంగంలోకి దిగారు. ప్రముఖుల ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున నగదు, నగలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులతో కోలీవుడ్ ఉలిక్కి పడింది.