
సీఎం సీటుకు పెరిగిన పోటీ
కమలదళంలో కొత్తగా పుట్టుకొస్తున్న ముఖ్యమంత్రి అభ్యర్థులు
సాక్షి, ముంబై: మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడే పోటీ ప్రారంభమైంది. ఇప్పటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, శాసనసభలో ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే, మండలిలో ప్రతిపక్ష నేత వినోద్ తావ్డేల పేర్లు మాత్రమే వినిపించాయి. అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత బీజేపీ విజయం ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ సర్వేలో తేలడంతో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది.
గోపీనాథ్ ముండే తనయ పంకజా ముండే ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ... తానూ సీఎం రేసులో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. అంతేకాక మరికొందరు నేతలు కూడా పార్టీ సీనియర్ నేతల వద్ద తమ మనసులోని మాట బయటపెట్టుకుంటున్నారు. పోలింగ్ పూర్తయి ఒకరోజైనా గడవలేదు.. అప్పుడే సీఎం పదవి కోసం పోటీ పడడమేంటి? అని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కిందిస్థాయి నుంచి ఫైరవీలు...
సాధారణంగా ఏదైనా పదవి ఆశిస్తున్నవారు ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని కాకాపట్టి పదవులను సంపాదించుకుంటారు. అయితే ఆశపడుతున్నది ముఖ్యమంత్రి పదవి కోసం కావడంతో తప్పకుండా గెలుస్తాడని భావిస్తున్న పార్టీ అభ్యర్థులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ముఖ్యమంత్రి పదవి కోసం తమకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారని చెప్పుకునేందుకే ఆశావహులు ఈ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ముండే ఉండి ఉంటే...
గోపీనాథ్ ముండే మరణంతోనే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందని కార్యకర్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ముండే బతికున్న సమయంలోనే సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై చర్చ జరిగిందని, కేంద్రం నరేంద్ర, రాష్ట్రంలో దేవేంద్ర అనే మాట అప్పుడే తెరపైకి వచ్చిందని, ఇప్పుడు కూడా సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమేనని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
అయితే ముండే బతికుంటే అధిష్టానం కచ్చితంగా ఆయనకు మొదటి ప్రాధాన్యతనిచ్చేదని, ముండే తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయ్యేవారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఆయన కూతురు పంకజా ముండే కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చెప్పుకుంటున్నా అధిష్టానం అందుకు పెద్దగా ఆసక్తి కనబర్చకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫడ్నవీస్‌కే ఫస్ట్‌ఛాన్స్...
వెనుకబడిన ప్రాంతమైన విదర్భ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక విదర్భ కోసం ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే విదర్భ అభివృద్ధి చెందడం, తద్వారా ఉద్యమం చల్లారడం జరుగుతుందని బీజేపీ అధిష్టానం భావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
నితిన్ గడ్కరీ అండతో తావ్డే..
పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా పేరున్న నితిన్ గడ్కరీకి సన్నిహితుడిగా భావిస్తున్న వినోద్ తావ్డే కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయాల్లో గడ్కరీ పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుందని, ఆయన చక్రం తిప్పితే తావ్డే సీఎం గద్దెనెక్కడం ఖాయమంటున్నారు.
అనుభవమున్న నేత ఖడ్సే...
పార్టీలో సీనియర్ నాయకుడిగా, అనుభవమున్న నేతగా ఏక్‌నాథ్ ఖడ్సేకు మంచి గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం అభ్యర్థి ఎంపిక జరిగితే తప్పుకుండా ఏక్‌నాథ్ ఖడ్సేకే పీఠం దక్కవచ్చని చెబుతున్నారు.