సాక్షి, ముంబై : ఒకపక్క క్రిస్మస్ సెలవులు మరోపక్క నూతన సంవత్సరం కలసి రావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో భక్తుల రద్దీ అధికమైంది. ఫలితంగా సాయిబాబాను దర్శించుకునేందుకు కనీసం ఎనిమిది నుంచి 10 గంటల సమయం పడుతోంది. బాబా సంస్థాన్‌కు చెందిన భక్తి నివాస్, భక్తిధామ్ తదితర ఖరీదైన గదులతోపాటు పేదల కోసం నిర్మించిన చౌకఅద్దె గదులన్నీ కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరం మొదటిరోజు తెల్లవారుజామునే బాబా సమాధిని దర్శించుకోవడానికి వేలాది మంది ఒక రోజు ముందే షిర్డీ పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. తొలిరోజే బాబాను దర్శించుకోవడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయన్నది భక్తుల నమ్మకం.
ఈ ఏడు నూతన సంవత్సరం బుధవారం రావడంతో మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు షిర్డీకి చేరుకుంటారు. క్రిస్మస్ సెలవులు కావడంతో షిర్డీలో ఇది వరకే విపరీతమైన రద్దీ ఉంది. చౌకగానే లభించే బాబా సంస్థాన్‌కు చెందిన అద్దె గదులన్నీ నిండిపోయాయని సంస్థాన్ అధికారులు తెలిపారు. షిర్డీలో ఎముకలు కొరికే చలి ఉండగా, తలదాచుకుందామంటే గదులు దొరకడం లేదు. దీంతో భక్తులు చేసేదేంలేక ప్రైవేటు లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకుని హోటల్, లాడ్జీల యజమానులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్కసారిగా హోటల్ గదుల అద్దెలు నాలుగురెట్లు పెంచేసి జేబులు నింపుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి షిర్డీకి వచ్చే ప్రైవేటు లగ్జరీ బస్సుల యజమానులు కూడా అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. గుర్రపు బళ్లు మొదలుకుని ఆటోలు, సామానులు మోసే కూలీలు, గదులు చూపించే బ్రోకర్లు సైతం ఇష్టం వచ్చిన రీతిలో వసూలు చేస్తున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో దర్శనం కోసం క్యూలో నిలబడే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిలో దూరప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడడంతో తీవ్రంగా అలసిపోతున్నారు.
ముఖ్యంగా వృద్థులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు సంస్థాన్‌లో పైరవీలు చేయకుండా నిరోధించడానికి ప్రజాసంబంధాల కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో సామాన్య భక్తుల మాదిరిగానే వీఐపీలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు క్యూలోనే బాబాను దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలాఉండగా భారీగా నిర్మించిన ప్రసాదాలయం కూడా ఎటూ సరిపోవడం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడితే తప్ప భోజనం లభించడం లేదు. ఇదే పరిస్థితి అల్పహారం, టీ, కాఫీ కౌంటర్ల వద్ద కూడా కనిపిస్తోంది. భక్తులను నియంత్రించేందుకు పట్టణవ్యాప్తంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
షిర్డీకి పెరిగిన రద్దీ
Published Mon, Dec 30 2013 11:54 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement