‘న్యూ ఇయర్’ కోసం షిర్డీ సిద్ధం..
సాక్షి, ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ పుణ్యక్షేత్రానికి లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సాయి సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర జాదవ్ చెప్పారు. ఈ నెల 31వ తేదీన (బుధవారం) 24 గంటలూ బాబా ఆలయాన్ని తెరిచే ఉంచుతామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. ఇవి పూర్తికాకముందే నూతన సంవత్సర వేడుకలు వస్తున్నాయి.
కొత్త సంవత్సరం రోజున బాబాను దర్శించుకునేందుకు యేటా రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది జనం షిర్డీకి తరలివస్తారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని బాబాను దర్శించుకునేందుకు బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు నిరంతరంగా క్యూ కొనసాగుతూనే ఉంటుందని జాదవ్ చెప్పారు. కేవలం ఆరతి సమయంలో 15 నిమిషాలపాటు క్యూను నిలుపుతారని చెప్పారు. ప్రస్తుతం షర్డీలో విపరీతమైన చలి ఉంది.
భక్తులు సాధ్యమైనంత వరకు అతిథి గృహాలు, భవనాల వరండాల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చలి నుంచి తట్టుకునేందుకు అదనంగా చద్దర్లు, తివాచీలు సమకూర్చారు. తాగునీరు, స్నానాల గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు జాదవ్ తెలిపారు. రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, టీ, కాఫీ, లడ్డు ప్రసాదం కోసం అదనంగా కూపన్ విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.