సాయి చేసే ప్రతి చేష్టా, సాయి మాట్లాడే ప్రతి మాటా, సాయి నడిచే ప్రతి ప్రదేశం, సాయి చరిత్రలో కన్పించే ప్రతి సంఘటనా ఓ కొత్త విషయాన్ని జీవితాంతం మనకి గుర్తుండేలా, గుర్తుంచుకునేలా చేస్తూనే ఉంటుంది. ఓ చిరుచీకటి ఉన్న గదిలోనికి ప్రవేశించకుండానూ, కనీసం ప్రవేశించి చూద్దామనే ఊహకూడా లేకుండానూ అదో చీకటి శూన్యపు గది అనడం ఏ మాత్రమూ సరికాదు. చక్కని దీపపు వెలుగుతో దానిలోనికి ప్రవేశించి, చూస్తే ఏదైనా ఉందో లేదో? ఉంటే ఏముందో?... అలా వివరాలన్నింటినీ తెలుసుకోగలుగుతాం! అదిగో ఆ పనినే చేద్దాం! చేస్తున్నాం కూడా!ఆ మేకని చంపెయ్!
ఎవరో ఓ వ్యక్తి ఓ మేకని తెచ్చి సాయికి ఇచ్చాడు. ఆ మేకని సాయి దగ్గరే ఓ చిన్న స్తంభానికి కట్టివేశాడు. భక్తులంతా చూస్తున్నారు ఆ మేకని. అది పాపం అందరూ జాలిపడేలా దీనాతి దీనంగా చూస్తోంది. ఆ సందర్భంలో సాయి ‘బడేబాబా’ అనే అతన్ని పిలిచాడు ‘రావలసింది’ అని.బడేబాబా సాయికి ఎంతో.. మళ్లీ మాట్లాడితే.. మరెంతో సన్నిహితుడు. రోజూ సాయి అతనికి 50 రూపాయలని దక్షిణగా ఇచ్చేవాడు.అలా సొమ్మిచ్చినందుకు సన్నిహితుడని దీని అర్థం కాదు. బడేబాబాని కొంతదూరం సాగనంపి వస్తుండేవాడు సాయి.ఏ రోజూ భక్తులంతా భోజనం వేళకి సభామండపానికి ఆనందంగానూ సాయితో కలిసి కూర్చుని భోజనాన్ని చేయాలనీనూ ఆత్రుతతో వస్తూండేవారు. భక్తులంతా ఎదురు బదురుగా రెండు వరుసల్లో ఓ క్రమశిక్షణ పద్ధతిలో తాడు పట్టుకుని చూస్తే సరిపోయేంత సరళరేఖలా చక్కగా కూర్చుంటూండేవారు. ఈ రెండు వరుసలూ ఎంతో పొడుగ్గా ఉండేవి. ఆ రెండు వరుసలకీ మధ్యలో ఆ వరుసలు ప్రారంభమయ్యే చోటున ఇద్దరు కూర్చోవడానికి రెండు చోట్లు ఖాళీగా ఉండేవి. ఆ కుడివైపున సాయి కూర్చునేవాడు. ఆయనకి ఎడమ పక్కన బడేబాబా కూర్చునేవాడు. మొత్తం అందరి విస్తళ్లలోనూ వడ్డన అయిపోయినా భోజనం చేసే సంప్రదాయం సాయికి బాగా తెలుసు కాబట్టి, ఆ సాయి భక్తులకీ మరింతగా తెలుసు కాబట్టి, ఎవరి మటుకు వారు విస్తళ్లలో వేయబడ్డ పదార్థాలని వేసిన వెంటనే తినేస్తుండేవారు కానే కాదు. ఇలాంటి సందర్భాలని పరిశీలిస్తే ‘బ్రాహ్మణసమారాధన, బ్రాహ్మణ గృహాల్లో జరుగుతూండే భోజన సంప్రదాయ పద్ధతి’ సాయిలో కన్పిస్తూ ఆశ్చర్యం వేస్తుంది.
ఇంత వడ్డన జరిగినా.. ఇందరూ వచ్చి కూర్చున్నా.. సాయి మాత్రం తన ఎడమపక్కన బడేబాబా వచ్చి కూర్చోనిదే విస్తరిని ముట్టేవాడు కాడు. అలాగని బడేబాబా కావాలని ఆలస్యం చేయడమో లేక ఏదో పని మీద ఉండి ఆలస్యంగా వస్తూ ఇందరిని ఎదురుచూసేలా చేయడమో చేసేవాడు కాదు! అదే సభామండపంలో కొంత ముందుగానే వచ్చి, భక్తి శ్రద్ధలతో ఓ మూల కూర్చుని, సాయి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అంతా కూర్చున్నాక, అన్ని పదార్థాలు వడ్డింపబడ్డాక ఇక భోజనాన్ని చేయవచ్చు అన్నాక.. ఆవో బడేబాబా (బడేబాబా! రా! ) అని ఆప్యాయంగా పిలిచేవాడు సాయి. ఆవుదూడ కట్టుని విప్పేస్తే ఎలా ఆ దూడ తల్లిగోవు పొదుగులో తలని దూర్చేస్తుందో అలా, అంత ఇష్టంతో బడేబాబా వచ్చి సాయి ఎడమపక్కన కూర్చునేవాడు. ఆ మీదట భోజనాలు ముగిసేవి. ఇది ఓ నిత్యక్రతువులా సాగిపోతూ ఉండేది షిర్డీలో.
అయితే ఈ రోజున మాత్రం అందరూ భోజనాన్ని ప్రారంభించే ముందు, అందరూ వింటూ ఉండగా.. ‘బడేబాబా! ఈ మేకని కత్తితో ఒకే వేటుకి తల నరికి చంపెయ్!’ అని బిగ్గరగా ఆజ్ఞ చేసాడు సాయి. అది దీపావళి రోజు కావడంతో రోజూ కంటే ఎక్కువ పదార్థాలతో పాటు మిఠాయిల్నీ, ఇంకా తీపిపదార్థాలనీ కూడా వడ్డించారు విస్తళ్లలో. రోజూ ఉండే పద్ధతి ప్రకారం బడేబాబాని సాయి పిలవటం ఆయన వచ్చి కూర్చోగానే భోజనాలు ప్రారంభం కావటం జరగాల్సి ఉంది. అయితే కథ తారుమారై.. ‘మేకను చంపడం’ అనే కొత్త కథ ప్రారంభమైంది. భక్తులంతా వింతగా చూస్తున్నారు ఏం జరుగుతుందోనని.బడేబాబా సాయి చేసిన ఈ ఆజ్ఞని విని బాధతో సాయి పక్కకి వచ్చి కూర్చోవలసిన వాడు కాస్తా.. ఎటో వెళ్లిపోయాడు. అది సాయి ఆజ్ఞ కదా! ఎవరో భక్తులు మొత్తానికి బడేబాబాని వెదికి తీసుకొచ్చారు. బడేబాబా కూర్చోనిదే సాయి భోజనాన్ని ముట్టడు కదా! సాయి ప్రారంభించనిదే భక్తులు కూడా ప్రారంభించరు గదా! అదీ అప్పటి స్థితి. ఎవరికీ ఏం తోచడం లేదు.బడేబాబాని ఇలా మర్యాదపూర్వకంగా ఆప్యాయతతో భోజనానికి పిలవడం, ఆయన వచ్చి తన సరసన కూర్చుని ఆయన భోజనాన్ని ముట్టుకున్నాక తాను భోజనాన్ని ప్రారంభించడమనే ఈ పద్ధతిని అందరు భక్తుల సమక్షంలోనూ సాయి చేస్తూ ఉండటం ఎందుకంటే... అతిథి అనేవాడు లేకుండా తానొక్కడే తినకూడదని, ఆ అతిథిని కూడా గౌరవపూర్వకంగా ఆహ్వానించవలసిందే తప్ప చేతి సంజ్ఞని చేస్తూ చోటుని చూపించడం సరికాదనీ, అతిథి తన భోజనాన్ని ముగించాక యథాశక్తి దక్షిణని ఇచ్చి, కనీసం నూరు అడుగులైనా ఆయనతో వెళ్తూ ఆయన్ని సాగనంపి రావాలనీ, దాన్నే అతిథి సత్కారమంటారనీ అందరికీ తెలియజెప్పడానికే సాయి ఇలా చేస్తూ ఉండేవాడు రోజూ.
అలాంటిది, అంత గొప్పగా తాను భావించే అతిథిని, అది కూడా ఎవరో అతిథి కాకుండా బడేబాబాని ‘మేకని చంపవలసిందే’ అని ఆజ్ఞాపించడమా? అది కూడా ఈ సమయంలోనా? అని అంతా ఆశ్చర్యపోతూ ఉంటే బడేబాబా ‘నిష్కారణంగా ఈ మూగజీవిని నేనెందుకు చంపాలి?’ అని సాయిని ప్రశ్నించాడు.సాయి వెంటనే అక్కడే ఉన్న ‘శ్యామా’ అనే మరింత సన్నిహిత భక్తుడ్ని చూస్తూ ‘పోనీ! నువ్వైనా సరే కత్తి తెచ్చి ఒకే ఒక్క వేటుతో దీని తల నరికెయ్యి! పో! కత్తి తెచ్చుకో! వెళ్లు వెంటనే!’ అన్నాడు. నిజానికి శ్యామాకి కూడా మనసు నిండుగా చెప్పలేనంత బాధ వస్తోంది ఆ జాలి గొలుపుతున్న మేకని చూస్తుంటే. బడేబాబాలాగానే తనకీ అనిపిస్తోంది ‘నిష్కారణంగా ఆ మూగజీవాన్ని తాను చంపడమా?’ అని. ‘అసలు అలాంటి మూగజీవిని చంపబోతున్నా చూడలేమే! మరి దాన్ని నేను నా చేతులతో చంపడమా?’ అని లోలోపల కుమిలిపోతూ అది సాయి ఆజ్ఞ అనుకుంటూ చక్కని వంటలని భక్తితో శ్రద్ధతో సకాలంలో వండి పంపించే రాధాకృష్ణమాయి దగ్గరికెళ్లి కత్తి తెచ్చి ఆ కత్తిని సాయి ముందు పెట్టాడు శ్యామా.ఇంతలో భక్తుల ద్వారా రాధాకృష్ణమాయికి కత్తి విషయం తెలిసి దాన్ని ఓ మూగజీవిని బలిని ఇచ్చేందుకు ఉపయోగించవలసివస్తే వద్దు! కత్తిని తిరిగి తెచ్చేయవలసిందని రాధాకృష్ణమాయి కబురు చేసింది సభామండపానికి.
సాయి ఈ విషయాన్ని తెలుసుకుని.. కొద్ది దూరంలో ఉన్న శ్యామానే మళ్లీ పిలుస్తూ ‘సరే! మరోచోటి నుంచి కత్తిని తెచ్చి ఒకే ఒక్క వేటుకి దాని తలని నరికెయ్యి!’ అని ఆజ్ఞ చేశాడు. భక్తులందరికీ ఈ మేక తలని నరకడంలో సాయి చూపిస్తున్న పట్టుదలకి ఆశ్చర్యం అనిపిస్తోంది. మేక ప్రాణాలు ఎలా పోతాయోనని బాధగా ఉంది! ఆ సంఘటనకి సాక్షిగానూ, ఏ దోషం చేసిందో ఎవరికీ తెలియని ఓ ముద్దాయిలా నిలబడి, అమాయకంగా మరణశిక్ష పడుతుందని కూడా తెలియని తీరులో నిలబడి ఉంది మేక.‘కర్ర విరగకుండా.. పాము చావకుండా..’ అనే సామెతకి ఉదాహరణగా శ్యామా కత్తిని తేవడానికి వెళ్లినట్లుగా వెళ్లి ఎంతసేపటికీ రాకుండా ‘ఓడ’లో కూర్చుండిపోయాడు. మేక ఎవరి చేతిలోనూ చంపబడకూడదని, తన చేతితో తాను నరకనే నరకకూడదని శ్యామా దృఢసంకల్పం. అందుకే సాయి ఆజ్ఞకి కట్టుబడినట్లే ఉంటూ అక్కడే ఉండిపోయాడు.ఎంతసేపటికీ శ్యామా రాకపోయేసరికి సాయి మరో సన్నిహిత భక్తుడైన ‘కాకా’ని పిలిచి.. ‘కాకా! తొందరగా నువ్వైనా ఈ పనిని ముగించెయ్యి’ అన్నాడు.కాకాలో అంతర్మధనం ప్రారంభమైంది. మేలిమి బంగారంతో సమానమైనవాడివని తనని సాయి అనేక పర్యాయాలు అన్నాడు. చెప్పిన ఆజ్ఞని పాటించేవాడివని కూడా అంటుంటాడు. అలాంటి తనని ఈ అకృత్యాన్ని చేయవలసిందేనని సాయి ఆజ్ఞాపిస్తున్నాడంటే ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. ఇప్పటికే తన ముందు ముగ్గురు ఆ పనిని చేయడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విముఖతని చూపిస్తే.. ఆ పనిని సాయి తనకి పురమాయిస్తున్నాడంటే.. ఏదో ఉండే ఉంటుంది దానిలో ఓ రహస్యం.
వజ్రం ఎంతో గొప్పది. ఎంత కొట్టినా పగులనితనంతో దృఢంగా ఉంటుంది. అలాంటి వజ్రాన్ని కూడా చక్కనైన నగలో అమర్చాలంటే దానికీ కోత తప్పదు. నగిషీకోసమని సాన మీద అరగదీయడం తప్పదు. ఒక సన్నని తీగని చుట్టి ఆ వజ్రాన్ని మంచి వేడితో మండిపోయే కొలిమిలో కాల్చడం తప్పదు. అది ప్రకాశించాలంటే, దాని గొప్పదనం తెలియాలంటే, లోకానికి తెలియజేసేలా చేయాలంటే.. ఈ చిత్రహింసలు, మనం అనుకునే ఈ తీరు పరీక్షలు దానికి తప్పవు. మరి ఈ కఠిన పరీక్షలన్నీ వజ్రానికే ఉంటాయి గానీ, మామూలు రాతికి ఉండనే ఉండదు కదా!... అని ఈ తీరులో ఆలోచించుకుంటుంటే.. ఇంకా ఆలస్యం చేస్తున్నావేమి? అన్నట్లు చూశాడు సాయి.దాంతో తాను గురువు ఆజ్ఞని ధిక్కరిస్తూన్న భావం మనసులో మెదిలింది. ‘నేను చేసే దానిలో, చేస్తున్న దానిలో ఏదైనా తప్పుగానీ ఉంటే అది సాయి–నామజపం వల్ల పూర్తిగా తొలిగిపోయి తీరుతుంది’ అని దృఢభావంతో కత్తి కోసం బయలుదేరాడు. తనకి ఏ హానినీ చేయని ఆ మూగజీవిని చంపడమనే పాపం కంటే గురువు ఆజ్ఞని ధిక్కరిస్తూ ఇందరు భక్తుల మధ్య గురువుని తృణీకరించినవాడు’ అని అన్పించుకోవడం మహా పాపం అనుకున్నాడు. అయినా సాయినామజపమనే ఔషధం తనదగ్గరే ఉన్నప్పుడు ఈ మనోవ్యాధి తననేం చేస్తుంది? అనే దృఢధైర్యంతో పదును చూసుకుని మరీ కత్తిని తెచ్చుకోవాలనుకున్నాడు. దానికి కారణం సాయి ఆజ్ఞ ప్రకారం దాని మెడ ఒక్కవేటులోనే తెగిపోవాల్సి ఉంది కాబట్టి.గురువు ఆజ్ఞని పాటిస్తున్న తనకి పుణ్యం లభిస్తుందనే నమ్మకం తప్ప కాకాకి మరో ఆలోచనే రావడం లేదు, రాలేదు. భక్తులందరూ కాకా కూడా శ్యామాలాగానే ఎక్కడకో వెళ్లి రాకుండా ఉండిపోతాడని అనుకున్నారు. అయితే కాకా మాత్రం ‘సాఠేవాడా’ అనే ప్రదేశానికి వెళ్లి, కత్తినీ దాని పదునునీ నిశితంగా పరిశీలించుకుని, తన వెంట తెచ్చుకుని సాయి సమక్షానికొచ్చాడు. భక్తులందరికీ భయం, ఉద్వేగం, ఆశ్చర్యం, మూగజీవి పట్ల జాలి.. అయ్యో! అనే భావాలు కలుగుతున్నాయి.
కాకా తన ధోవతిని ఎగగట్టాడు. చొక్కా చేతుల్ని పైకి మడుచుకున్నాడు. మేక వద్దకి వెళ్లాడు. లోపల ఆలోచన ప్రారంభమైంది. తాను పుట్టుకతో బ్రాహ్మణ కులానికి చెందినవాడు. సహజంగానే కోమల స్వభావం, చెప్పలేని కరుణా, అంతేకాక తన వంశంలో మాంసాహారం కాదు గదా కోడిగుడ్డుని కూడా వాడని వాడైన కారణంగా హింసాభావమే ఉండదు. ఆ కారణంగా ఈ మూగజీవిని చంపడమా? అనే ఆలోచన మళ్లీ ప్రారంభమైంది మనసులో. ఆ మేక మాత్రం వెర్రి చూపులు చూస్తోంది.‘గురుకార్యం కర్తవ్యం’ అనే దిటవుతో రెండు చేతులతో కత్తిని గట్టిగా పట్టుకుని ఆ మేకని నరకడం కోసం సిద్ధమై ‘సాయీ.. తలని నరుకుతున్నా..!’అంటూ మేక మెడని చూస్తున్నాడు నిశితంగా. హఠాత్తుగా అతని మదిలో జాలి ప్రారంభమైంది. కత్తి పట్టిన చేతులు వణుకుతున్నాయి. అడుగులు వెనక్కి పడుతూ ముందుకి రాలేక మేకమెడకి సూటి తప్పుతూ ఉంటే.. సాయి ఆ పరిస్థితిని గమనించి.. ‘చూస్తావేం? నరుకు!’ అన్నాడు బిగ్గరగా. మేకకి అదే చివరి శ్వాస అనుకుంటూ కాకా ఓ మారు సాయినామాన్ని జపించి, తలని తెగగొట్టడం కోసం కత్తిని దృఢంగా పట్టుకుని, బలంగా ఎత్తి వేటు వేసెయ్యబోతుంటే సాయి బిగ్గరగా అరుస్తూ... ‘ఆగాగు! దాన్ని చంపుతావేమిటయ్యా? ఏం అపకారం చేసింది నీకు? మూగజీవి కదా! పైగా మరణాసన్న (చావుకి సమీపించిన) స్థితిలో ఉంది కదా! అంతేకాక నువ్వు బ్రాహ్మణుడివి! చంపవచ్చునా?’ అనగానే కాకా కత్తిని కిందపడేశాడు.
ఎవ్వరికీ ఏం అంతుబట్టడం లేదు. ఎందుకు చంపమన్నాడో...? ఎవరికి వాళ్లు తప్పించుకుంటూంటే పట్టుబట్టి చంపడానికి సిద్ధపడేంతవరకూ ఎందుకు ప్రోత్సహించాడో...? చివరికి గుండెధైర్యంతో మనసుని చంపుకుని, చంపబోయేసరికి వద్దని ఎందుకు నివారిస్తున్నాడో..? ఎవరికీ అర్థం కాలేదు.సాయి అన్నాడు. ‘కాకా..! ఇలారా!! ఇది నిజంగా చావుకి సమీపంగా ఉన్న మేక. చూడు ఎంత దుర్బలంగా ఉందో! దీన్ని తెచ్చి ఇచ్చాడు ఆ వ్యక్తి ఎవరో, దీన్ని సంప్రదాయబద్ధమైన పద్ధతిలో ‘‘హలాల్’’ చేస్తాను. నీటి పాత్రని పట్టుకో!’ అన్నాడు. ‘‘హలాల్’’ అంటే చావబోతున్న మేక చెవిలో ఖురాన్ మంత్రాలని కొన్నింటిని చదవడం అని అర్థం. అలా చదివి, దాని కట్టు నుంచి తొలిగించారు. అంతే! అది కొద్ది దూరం అడుగులు వేసి, తనంత తానే చనిపోయింది అందరూ చూస్తుండగానే.నేర్చుకోవలసిందేమిటి?ఈ మేకకి మాత్రమే చావు లేదు. మనందరం కూడా అలాంటి మేకల్లాంటి వాళ్లమే. అక్కడెవరో ఓ వ్యక్తి సాయికి ఆ మేకని బహూకరించినట్లు, మనల్ని కూడా మన తల్లిదండ్రులు ఓ శరీరాన్ని ఇచ్చి, ఈ లోకంలో ఓ ప్రాణిగా అందించారు. ఈ శరీరానికి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా మరణమనేది తప్పదు. ఆ విషయం మనకెందుకు గుర్తుండదు. మన ముందే ఎందరో చనిపోతున్నా, వాళ్ల అంత్యక్రియలకి వెళ్లి అక్కడి కార్యక్రమాలని చూసి వస్తున్నా, ఆ నిరాశ, వైరాగ్యమనేవి ఏ ఒక్కటో రెండు రోజులు మాత్రమే ఉంటూ ఆ మీదట మర్చిపోతూ ఉంటాం.
కాలం అనేది మేకని చంపడానికి ఉపయోగించబడే కత్తి లాంటిది. ఆ కాలమనేది ఎవరి కారణంగా, ఏ స్థలంలో, ఏ తీరుగా, ఎందుకు మూడుతుందో తెలియదు. అందుకే చంపాలన్న ఆజ్ఞని వింటూనే ‘ఎందుకు?’ అన్నాడు బడేబాబా. కత్తి కోసం వెళ్లి అక్కడే ఉండిపోయాడు శ్యామా. ఏ మాత్రమూ ఇష్టంలేక ప్రయత్నించి విఫలుడయ్యాడు కాకా.భగవంతుడనే వాడు కూడా మన మరణాన్ని అనేక పర్యాయాలు ఇలాగే ఏవో కారణాలతో వాయిదా వేయిస్తూ ఉంటాడు. దాని కోసమే మనం నామజపాన్ని చేయవలసి ఉంటుంది. మేకని చంపదలిచి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా మేక అమాయకంగా చూస్తోందే తప్ప కట్టు విడిపించుకుని పారిపోయే ప్రయత్నాన్నే చేయడం లేదు. అందరు భక్తులున్నా ఎవరూ ఆ సాయి ఆజ్ఞకి వ్యతిరేకాన్ని చెప్పడం లేదు. భగవంతుని ఆజ్ఞ దాట వీలులేనిది. ఎదురు తిరిగే శక్తిని ఎవరికీ ఇయ్యనిది. ఏదో మనం చేసుకున్న పుణ్యాల కారణంగానే మనకి చావు సమీపించి ఉన్న ఏవేవో కారణాల ప్రకారం ఆ విరోధించే వ్యక్తులు వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఆ ఇబ్బంది తప్పినప్పుడల్లా అది మన సామర్థ్యం, మేధావితనం, నేర్పరితనం అని మనమనుకుంటాం తప్ప అదంతా దైవకృప అని అనుకోం.ఇలాంటి మరణాసన్నస్థితిలో ఉండి కూడా కావాలని ఎవరికో హానిని తలపెట్టడం, బాకీలని తీర్చకపోవడం, దౌర్జన్యాలు చేయడం, తల్లిదండ్రులకి మనస్తాపాన్ని కల్పించే పనుల్ని చేయడం.. వంటి ఎన్నింటినో బాగా తెలిసి కొన్నింటినీ, తెలియక కొన్నింటినీ చేస్తూనే ఉంటాం.ఆ మేకకి సాయి ‘హలాల్’ చేసినట్టుగా మనకి కూడా సాయిలాంటి యదార్థ గురువు మంత్రోపదేశాన్ని చేసినట్లయితే అప్పుడు లభించే మరణం స్వచ్ఛందమరణం లాంటిదే. అదే ఆత్మకి శాంతినిస్తుంది. ఇంతటినిగూఢార్థాన్ని అర్థం చేయించేందుకే సాయి ఈ ఘాతుక సంఘటనని మన ముందుంచాడు తప్ప సాయి మాత్రం పరమ దయార్ద్రహృదయుడే!యదార్థ భాగవద్భక్తుడైన మహమ్మదీయుని వద్దకి వెళ్లడం, ఆయన్ని గురువుగా భావించడం వల్ల అపవిత్రత వస్తుందా? అనే అంశాన్ని చూద్దాం!
–సశేషం
మేకని చంపి తీరాల్సిందే! అన్నాడా సాయి? ఇదేమిటి?
Published Sun, Sep 9 2018 12:40 AM | Last Updated on Sun, Sep 9 2018 12:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment