విద్యుత్ షాక్
- యూనిట్‌కు సగటున 32 పైసలు వడ్డన
- ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి
- ‘వ్యవసాయ పంపు సెట్లు, భాగ్య జ్యోతి, కుటీర జ్యోతి’కి మినహాయింపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇటీవల బస్సు చార్జీల పెంపుతో సతమతమవుతున్న ప్రజలకు కర్ణాటక విద్యుత్ నియంత్రణ సంఘం (కేఈఆర్‌సీ) పెద్ద షాక్‌నిచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా విద్యుత్ చార్జీలు పెంచింది. సగటున యూనిట్‌కు 32 పైసల వంతున పెరిగింది. కేఈఆర్‌సీ చైర్మన్ ఎంఆర్. శ్రీనివాసమూర్తి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి యూనిట్‌కు పది పైసల నుంచి 50 పైసలు వరకు పెరిగినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం ఐదు విద్యుత్ సరఫరా కంపెనీల (ఎస్కాంలు) పరిధిలో చార్జీలు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ పంపు సెట్లతో పాటు భాగ్య జ్యోతి, కుటీర జ్యోతి పథకాలకు ఈ చార్జీల పెంపు వర్తించబోదని చెప్పారు.
యూనిట్‌కు 66 పైసల వంతున పెంచాలని ఎస్కాంలు ప్రతిపాదించాయని తెలిపారు. వాటి ఖర్చులను దృష్టిలో ఉంచుకుని సగటున 32 పైసలు వంతున పెంచడానికి అనుమతినిచ్చామని చెప్పారు. గృహ వినియోగ కరెంటు చార్జీలను 30 యూనిట్ల వరకు 20 పైసలు వంతున పెంచామన్నారు. 30 యూనిట్లు పైబడితే 30 పైసలు చొప్పున పెంచినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 30 యూనిట్ల వరకు రూ.2.70 చొప్పున, 30 నుంచి వంద యూనిట్ల వరకు రూ.4, అంతకు మించితే రూ.6.25 చొప్పున చార్జీలుంటాయని వివరించారు. బెంగళూరు, మైసూరు, మంగళూరు, గుల్బర్గ, హుబ్లీ విద్యుత్ సరఫరా కంపెనీలు రూ.1,229 కోట్ల నష్టాల్లో ఉన్నందున, చార్జీల పెంపు అనివార్యమైందని తెలిపారు. కాగా పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు యూనిట్‌కు 30 నుంచి 40 పైసల వంతున పెంచామన్నారు.
అపార్ట్‌మెంట్లకు ప్రస్తుతం రూ.4.70గా ఉన్న చార్జీని రూ.5.35కి పెంచినట్లు తెలిపారు. కాగా రాష్ట్రంలో 10 హెచ్‌పీ కలిగిన 21 లక్షల పంపు సెట్లు, 22 లక్షల భాగ్య జ్యోతి, కుటీర జ్యోతి కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. వీటికి ఏటా రూ.5,381 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు.