రహస్యమేనా?
Published Wed, Jan 29 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
శ్రీలంక, తమిళ జాలర్ల మధ్య చర్చల్లో ఎలాంటి తీర్మానాలు చేశారన్నది అత్యంత రహస్యంగా మారింది. ఏ ఒక్క అంశం కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆంతర్యమేమిటని జాలర్లు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ అంశంపై చర్చించారో తెలపాలని ప్రతిపక్షాలు గళమెత్తుతున్నారుు. చర్చలోని తీర్మానాలు గోప్యంగా ఉంచడాన్ని బట్టి చూస్తే, అవి అమల్లోకి వచ్చేనా అన్న సందిగ్ధత నెలకొంది.
సాక్షి, చెన్నై:తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం గురించి తెలిసిందే. ఈ దాడులకు ముగింపు పలికే రీతిలో శ్రీలంక, తమిళ జాలర్ల మధ్య చర్చకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. చెన్నై డీఎంఎస్ ఆవరణలో సోమ వారం చర్చలు జరిగాయి. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయపాల్ సమక్షంలో రెండు దేశాల జాలర్లు చేపల వేటపై సుదీర్ఘంగా చర్చించారు. పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు చాలా సమయం తీసుకోవడం గమనార్హం.చర్చ: రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటుగా రాష్ట్రంలోని నాగపట్నం, తంజావూరు, పుదుకోటైై్ట్ట, రామనాథపురం, పుదుచ్చేరి, కారైక్కాల్ జాలర్ల సంఘాల తరపున వీరమణి, చిత్ర వేల్,
జగన్నాథన్, శివజ్ఞానం, రాజమాణిక్యం, కుట్టి, రామకృష్ణన్, జేసు రాజ్‌తోపాటు 24 మంది, శ్రీలంక తరపున సదాశివం, జస్టిన్, జోయిష్, అమల్ రాజ్, అరుల్ జనీఫర్, పొన్నాంబల్, సెంథిల్ నాథన్, అంతోని, అమృతా నందన్ తదితర జాలర్ల సంఘాల ప్రతినిధులతో పాటుగా 18 మంది అధికారులు ఈ చర్చలకు హాజరయ్యారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి సుచిత్రతో పాటుగా శ్రీలంక , దౌత్య కార్యాలయ వర్గాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి.సరిహద్దులు దాటొద్దు: రెండు దేశాల జాలర్లు సరిహద్దులు దాటడం వల్లే వివాదం రాజుకుంటున్నదన్న విషయాన్ని ఈ చర్చల ద్వారా తేల్చారు. పాక్ జల సంధిలో పారంపర్యంగా సాగుతున్న చేపలవేటపై సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి వలల్ని ఉపయోగించాలో అన్న విషయంపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, కచ్చ దీవుల జోళికి జాలర్లు వెళ్లనట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర జాలర్లు తెరపైకి తెచ్చినా, అది ఆయా ప్రభుత్వాల నిర్ణయం మీదే ఆధార పడి ఉందంటూ శ్రీలంక జాలర్ల ప్రతినిధులు తోసి పుచ్చడం గమనార్హం.
సీక్రేట్: చర్చలు సంతృప్తికరంగా సాగాయని రెండు దేశాల జాలర్లు పైకి ప్రకటించినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఈ చర్చల ద్వారా తేల్చిన తీర్మానాల వివరాల్ని అత్యంత గోప్యంగా ఉంచడం అనుమానాలకు దారి తీస్తున్నది. తమ దేశ ప్రభుత్వంతో చర్చించాకే తుది నిర్ణయం అన్నట్టుగా శ్రీలంక జాలర్లు పదే పదే పేర్కొనడం చూస్తే, ఈ చర్చలతో రాష్ట్రంలోని జాలర్లకు ఒరిగేదేమిటోనన్న సందేహం వ్యక్తమవుతోంది. సంతృప్తికరంగా సాగిన చర్చల వివరాల్ని తమ దేశాధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాకే మలి విడత చర్చ అన్నట్టుగా శ్రీలంక జాలర్ల ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం. పారంపర్యం ప్రదేశంలో చేపల వేటపై తీసుకున్న నిర్ణయాల్ని, వలల గురించి, సరిహద్దులు దాటితే జరిగే పరిణామాలు, సహకారాల గురించి ఏ ఒక్క వివరాల్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం గమనార్హం.
గడువు: జాలర్లతో పాటుగా ప్రతి పక్షాలు ఈ చర్చల్లో తేల్చిన అంశాల్ని బహిర్గతం చేయాలని పట్టుబట్టేందుకు సిద్ధం అవుతున్నారుు. వీసీకే నేత తిరుమావళవన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, వివరాల్ని అత్యంత గోప్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటోనని ప్రశ్నించారు. శ్రీలంక ప్రతినిధుల తీరును చూస్తే, ఈ చర్చల ద్వారా తమిళ జాలర్లకు ఒరిగేది శూన్యమేనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. తమిళ జాలర్లకు శ్రీలంక ప్రతినిధులు గడువు విధించినట్టు సంకేతాలు వెలువడుతోన్నాయని, ఆ మేరకు 45 రోజుల పాటుగా తమిళ జాలర్లు సరిహద్దులు దాటకుండా ఉండాలని, తమ దేశంలో నిషేధం విధించిన వలల్ని తమిళ జాలర్లు ఉపయోగించకూడదంటూ శ్రీలంక ప్రతినిధులు ఆంక్షలు పెట్టి ఉండటం గమనార్హం. ఇవి అమల్లోకి పెట్టాకే తమ దేశంలో తుది విడత చర్చ అని చివరగా తేల్చడం కొసమెరుపు.
Advertisement
Advertisement