చె న్నై, సాక్షి ప్రతినిధి:సాగరంలో మత్స్యసంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా అమలు చేస్తున్న చేపలవేటపై 45 రోజుల నిషేధం గతనెల 31వ తేదీతో తొలగిపోయింది. రామనాథపురం, పంబన్, మండపం ప్రాంతాల మత్స్యకారులు వెంటనే వేట ప్రారంభించారు. శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు తొలిరోజునే తమ ప్రతాపం చూపడం ప్రారంభించాయి. 33 మంది జాలర్లను అరెస్ట్ చేసి, ఐదు పడవలను అపహరించుకుపోయాయి. సీఎం జయలలిత ప్రధానికి లేఖ రాయడంతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే 29 మంది జాలర్లను విడుదల చేశారు. ఈనెల 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన వారిని బెదిరించి తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో భయపడిపోయిన మత్స్యకారు లు అర్ధాంతరంగా వేట మానివేసి తిరుగుముఖం పట్టారు. బుధవారం మళ్లీ శ్రీలంక దళాలు విరుచుకుపడ్డాయి.
రామేశ్వరం, పంబన్‌కు చెందిన వందమంది జాలర్లు కచ్చదీవుల సమీపంలో చేపలవేట సాగిస్తుండగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాలుగు చిన్నపాటి నౌకల్లో అక్కడికి చేరుకున్న శ్రీలంక దళాలు వారి పడవలను చుట్టుముట్టాయి. వారి పడవల్లోని వలలను ధ్వంసం చేశారుు. వారు పట్టిన చేపలను తమ నౌకల్లోకి లాక్కున్నారు. వలలను సముద్రంలోకి గిరాటు వేశారు. తమ నౌకలతో మత్స్యకారుల పడవలను విచక్షణారహితంగా ఢీ కొట్టించారు. దీంతో బెర్నాడ్‌షా అనే జాలరికి చెందిన పడవ తునాతునకలైపోగా అందులోని మురుగన్, జగన్, రాజు, ముగిలన్, కరుపయ్య, కరుప్పుస్వామి, ఇన్సాసీ వెనింగ్టన్ తదితరులు సముద్రంలోకి దూకి కొన్ని గంటలపాటూ ఈదుకుంటూ గడిపారు. తోటి మత్స్యకారులు వారిని తమ పడవల్లోకి ఎక్కించుకుని ప్రాణాలను రక్షించారు.
వారి చేతుల్లో చిక్కితే జైళ్లలో పెడతారనే భయంతో పడవలను పరుగులు తీయించగా నౌకలతో వారిని వెంబడించి భీతావహులను చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రారంభమైన శ్రీలంక దౌర్జన్యకాండ రాత్రి 7 గంటల వరకు సాగింది. గస్తీ నిమిత్తం మరోతీరానికి శ్రీలంక దళాలు మరలడంతో ఇదే అదనుగా తీరంవైపు పడవలను రక్షించి ప్రాణాలను దక్కించుకుని ఇళ్లకు చేరుకున్నారు. జాలర్లు రాజేష్, కరుప్పు, ముగిలన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, కచ్చదీవుల వద్ద వేటసాగిస్తున్న తమను నాలుగు ఆధునిక నౌకల్లో శ్రీలంక దళాలు సమీపించాయి. వారిని గమనించిన తాము మరోచోటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా వెంటనే చుట్టుముట్టాయని తెలిపారు. తమగోడు వినిపించుకోక విచక్షణరహితంగా దాడిచేసి గాయపరిచాయని చెప్పారు.
సాధారణమైన తమ పడవను వారి నౌకలతో ఢీకొట్టించి ముక్కలు చేశారు. పడవ నీటిలో మునిగిపోతుండగా, అందులోని జాలర్లు సముద్రంలోకి దూకేశారని, అయినా వారిపై జాలి తలంచక హింసించారని ఆవేదన చెందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలని వారు కోరారు.
హింసాకాండ
Published Fri, Jun 6 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
Advertisement