చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగాళాఖాతంలోని కచ్చదీవుల సరిహద్దుల్లో చేపల వేటపై తమిళనాడు, శ్రీలంకల మధ్య అనాదిగా వివాదం నెలకొని ఉంది. కచ్చదీవులపై తమకు హక్కు ఉందంటూ తమిళ జాలర్లు వాదిస్తుండగా, హద్దుమీరితే హతమార్చేందుకు సైతం వెనుకాడబోమంటూ శ్రీలంక దళాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇలా ఎవరికివారు రెచ్చిపోతున్న నేపథ్యంలో తమిళ జాలర్లు తరచూ శ్రీలంక గస్తీదళాల చేతుల్లో దాడులకు గురవుతున్నారు. తమిళ మత్స్యకారులను అరెస్ట్ చేయడం, వారి మరపడవలను అపహరించడం అడపాదడపా కొనసాగుతూనే ఉంది. ఘర్షణ జరిగినప్పుడల్లా ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి లేఖ రాయడం, శ్రీలంక చెరలోని జాలర్లను విడిచిపెట్టేలా చర్యలు చేపట్టడం నిత్యకృత్యమవుతోంది.
జాలర్లను విడిచిపెడుతున్న శ్రీలంక ప్రభుత్వం మరపడవలను మాత్రం తన ఆధీనంలోనే ఉంచుకుంటోంది. ప్రస్తు తం శ్రీలంక స్వాధీనంలో సుమారు 72 మర పడవలు ఉన్నాయి. వీటికోసం రెండు దేశాల మధ్య రాయబారం సాగుతోంది. కచ్చదీవుల సరిహద్దుల్లో తమిళ జాలర్ల చేపల వేట కారణంగా తమదేశ మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారని శ్రీలంక అధ్యక్షులు రాజపక్సే వారం క్రితం ప్రకటించారు. తమిళ జాలర్ల హద్దుమీరిన తనం తమ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ఆయన ఆరోపించారు. తమ ఆధీనంలోని మర పడవలను గనుక అప్పగిస్తే తిరిగి అవే పడవల్లో చేపల వేటకు వస్తారు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని స్పష్టం చేశారు. అయినా తమిళనాడు ప్రభుత్వం కేంద్రం నేతృత్వంలో రాయబారం నెరపుతోంది.
ఇదిలా ఉండగా, శ్రీలంక దేశం యాళప్పానయంలోని పాత ఇనుప సామానుల అంగడికి తమిళ జాలర్లకు చెందిన 42 మరపడవలను అమ్మివేసినట్లు ఇక్కడి జాలర్లకు శనివారం సమాచారం అందింది. శ్రీలంక సముద్రతీరంలో మొత్తం 72 మరపడవలు ఉండగా, వాటిల్లో కొన్ని పాక్షికంగా నీటమునిగిపోయాయి. మరికొన్ని మాత్రమే చేపల వేటకు వినియోగించేవిధంగా ఉన్నాయి. తీరంలో పనికిరాని పడవలను తొలగించాల్సిందిగా శ్రీలంక ప్రభు త్వ మత్స్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాత ఇనుప సామాను వ్యాపారులకు అమ్మివేసినట్లు తెలుసుకుని తమిళజాలర్లు కుంగిపోయారు. మాకు దిక్కెవరు దేవుడా అంటూ గుండెలు బాదుకున్నారు.
శ్రీలంక దుర్మార్గం!
Published Sat, Sep 20 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement