చర్చలకు రెడీ!
Published Mon, Jan 13 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
సాక్షి, చెన్నై: రాష్ట్ర జాలర్లకు కడలిలో భద్రత కరువు అవుతున్న విషయం తెలిసిందే. శ్రీలంక నావికాదళం తరచూ పంజా విసురుతుండడం రాష్ట్ర జాలర్లను ఆందోళనలోకి నెట్టేసింది. రాష్ట్రానికి చెందిన 300 మందికి పైగా జాలర్లు ఆదేశ చెరలో బంధీలుగా ఉన్నారు. వందలాది పడవలు వారి ఆధీనంలో ఉన్నాయి. దీనిపై రాష్ట్రంలోని జాలర్లు పెద్ద ఎత్తున ఆందోళనల్ని సాగిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆమరణ దీక్షకు కూర్చోగా రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత బుజ్జగించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా లేఖాస్త్రాల్ని సంధించారు. అదే సమయంలో డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు నేతృత్వంలో గత నెల జాలర్ల బృందం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ప్రధాని మన్మోహన్ సింగ్‌ను వేర్వేరుగా కలుసుకున్నారు. వీరిని బుజ్జగించే విధంగా ఇరు దేశాల జాలర్ల మధ్య చర్చలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపించారు. దీనిని అస్త్రంగా చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కేంద్రంపై ఒత్తిడిని పెంచారు.
రెండు దేశాల జాలర్లతో చర్చలు వేగవంతం చేయాలని, ఇందుకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం శనివారం ఢిల్లీకి చేరుకుంది. అక్కడి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలతో చర్చలు చేపట్టింది. రెండు దేశాల మధ్య సఖ్యత కుదరడంతో చర్చలకు సిద్ధమవుతున్నారు.చర్చలకు రెడీ: చెన్నై వేదికగా చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20న జరిగే ఈ చర్చల్లో రాష్ట్ర జాలర్ల సంఘాల ప్రతినిధులు, మత్స్య శాఖ వర్గాలతో పాటుగా శ్రీలంక ప్రతినిధులు పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రెండు దేశాల మధ్య చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
20వ తేదీ జరిగే చర్చల్లో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగించబోతున్నట్టు వివరించారు. జాలర్ల సంక్షేమార్థం తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వస్తుంటే, పని గట్టుకుని విమర్శించడం తగదని డీఎంకేకు చురకలు అంటించారు. అలాగే, శ్రీలంక చెరలో బందీగా ఉన్న జాలర్లు మరో రెండు మూడు రోజుల్లో విడుదలవుతారని ప్రకటించారు. ఈ ప్రకటనతో జాలర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారుు. రెండు దేశాల జాలర్ల విడుదలతోపాటుగా సరిహద్దులు దాటే విషయమై, అరెస్టుల నుంచి బయటపడే విధంగా పలు అంశాలపై చర్చ చేపట్టనున్నామన్నారు. అరుుతే సీఎం చేసిన ప్రకటనకు భిన్నంగా శ్రీలంకలో ఆ దేశ మంత్రి రజిత సేనరత్న ఆదివారం వ్యాఖ్యలు చేశారు. తమిళ జాలర్లలతో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. చర్చ తేదీ ఖరారైందని, తాము వెళ్లడానికి సిద్ధమవుతున్నామన్నారు. చర్చల్లో తీసుకునే నిర్ణయాల మేరకే ఇక్కడి చెరలో ఉన్న వాళ్లను విడుదల చేస్తామని ఆయన పేర్కొనడం గమనార్హం.
Advertisement